
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి, రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైనా జిల్లాలోనే భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి సిద్ధలింగేశ్వర రథోత్సవం జరుపుకోవడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ భారీ ఉత్సవాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులను సస్పెండ్ చేయడం మరో సంచలన వార్తగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో వార్షిక రథోత్సవంలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోనందుకు చిత్తాపూర్ తాలూకా మెజిస్ట్రేట్, పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. రేవూర్ గ్రామాన్ని జిల్లా యంత్రాంగం సీల్ చేసింది. సామాజిక దూరం పాటించాలనే నిబంధనని ఈ రథోత్సవంలో పూర్తిగా ఉల్లంఘించారు.
Meanwhile, in Karnataka's Corona hotspot Kalaburagi, crowds gather as the Siddhalingeswara chariot festival is conducted despite lockdown orders and a ban on rituals of any kind. This is a district where 3 people have died from #Covid19, including the country's first fatality. pic.twitter.com/An3gREiHZd
— Shiv Aroor (@ShivAroor) April 16, 2020
కొంత మంది పురోహితులు, ఆలయ అధికారుల సమక్షంలో బుధవారం సాయంత్రం ఆలయంలో కొన్ని నిత్య పూజలు నిర్వహించి మరుసటి రోజు ఉదయమే ఆలయం బయటకి రథాన్ని తీసుకొచ్చి ఊరేగింపు నిర్వహించారు. ఇందులో సుమారు వెయ్యి మంది భక్తులు పాల్గొన్నారని ఒక అధికారి చెప్పారు. ఈ ఉత్సవాన్ని నిర్వహించడంలేదని అంతకు ముందే ఆలయ అధికారులు పత్రికా సమావేశం ద్వారా ప్రభుత్వానికి తెలియచేశారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ ఉత్సవం నిర్వహించవద్దని ఆలయ ట్రస్ట్ సభ్యులకి సమావేశాలు పెట్టి విజ్ఞప్తి చేశారని, చిత్తాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే చెప్పారు.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించినందుకు టెంపుల్ ట్రస్ట్ సభ్యులతోపాటు మరో 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మార్టిన్ మార్బానియాంగ్ తెలిపారు.
రెండేళ్ల చిన్నారికి కోవిడ్-19 సోకడంతో కంటైన్మెంట్ ఏరియాగా గుర్తించిన వాడి గ్రామానికి రథోత్సవం జరిగిన ప్రాంతం కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.