
గెరిల్లా లాంటి పోరాటంలో ఆరితేరిన నాయకుడు.. పోలీసుల ఎత్తులకు పైఎత్తులు వేయగల సమర్ధుడు. ఎలాంటి పద్మవ్యూహం నుంచైనా ఈజీగా తప్పించుకునే నేర్పరి. ఆయనే మావోయిస్టు నాయకుడు భాస్కర్. ఎన్నోసార్లు చిక్కినట్టే చిక్కి తృటిలో తప్పించుకున్నాడు. తాజాగా.. కదంబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న భాస్కర్ ఎక్కడికి పారిపోయాడు..? భాస్కర్‌తోపాటు ఎంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారు..? ఇప్పుడిది పోలీసులకు సవాల్‌గా మారింది.
మావోయిస్టు నాయకుడు భాస్కర్ అలియాస్ అడేళ్లు. రెండున్నర దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడు. దండకారణ్యంలో నిర్వహించిన ఎన్నో ఆపరేషన్‌లలో కీలకపాత్ర పోషించాడు. భాస్కర్‌పై వందకు పైగా కేసులు ఉన్నాయి. 20 లక్షల రివార్డ్ కూడా ఉంది. అంతటి పట్టున్న భాస్కర్ ను కేంద్ర మావోయిస్టు పార్టీ కుమ్రంభీం, మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్ దండకారణ్యంలో పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలు అప్పగించింది.
భాస్కర్ ఆది నుంచి పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో మకాంవేసి పార్టీని పునర్ నిర్మిస్తున్నారు. తిర్యాణి మండలంలోని దట్టమైన అడవులను స్థావరంగా మార్చుకొని కార్యకలాపాలు సాగిస్తున్నాడు. అయితే ఇప్పటికే కొంత మందిని పార్టీలో చేర్చుకొని బలోపేతం చేసినట్లుగా సమాచారం. ఇదే విషయం నిఘా వర్గాలకు తెలియడంతో టార్గెట్ అడెళ్లుగా కూంబింగ్ చేపట్టారు. జులైలో తొక్కిగూడలో భాస్కర్, పలువురు కమిటీ సభ్యులు పోలీసులకు తారసపడ్డారు. మావోలు-పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకోవడంలో భాస్కర్‌కు సాటి ఎవరూ లేరనే చెప్పాలి. భాస్కర్ తప్పించుకున్న ఎన్‌కౌంటర్ల సంఖ్య 50 వరకు ఉంటుందంటే ఆయన ఏపాటి ఘనాపాటో అర్థం చేసుకోవచ్చు. భాస్కర్‌కు గెరిల్లా పోరాటంలో కూడా ఎంతో పట్టుంది.
భాస్కర్, కమిటీ సభ్యులను కట్టడి చేయడానికి స్వయంగా డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు. వారిని పట్టుకోవడానికి ఆసిఫాబాద్‌లో డీజీపీ ఐదురోజులపాటు మకాం వేసి పోలీసులకు దిశా నిర్దేశం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా మళ్లీ కదంబ ఎన్ కౌంటర్ నుంచి కూడా తప్పించుకోవడం పోలీసులకు పెను సవాల్‌గా నిలిచింది. తప్పించుకున్న భాస్కర్ కదంబ పరిసర అడవుల్లోనే సంచరిస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. భాస్కర్, కమిటీ సభ్యులను పట్టుకోవడానికి పోలీసులు వందల బలగాలను దించారు. సరిహద్దు దాటకుండా పోలీసు వలయాన్ని ఏర్పాటు చేశారు. అటు పోలీసుల ప్రయత్నాలు.. ఇటు భాస్కర్ పై ఎత్తులు.. చివరకు ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
Comments are closed.