
పశ్చిమ బెంగాల్ లో రాజకీయ పరిస్థితులు వేడి పుట్టిస్తున్నాయి. మాట పట్టింపు ధోరణితో ఆధిపత్యం నిరూపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కావాలని బెంగాల్ సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ ను రీకాల్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం మమత కోరినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో సీఎస్ ను ఢిల్లీ పోవద్దని మమత హుకుం జారీ చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆలాపన్ ఢిల్లీలో రిపోర్టు చేయాల్సి ఉన్నా మమత సర్కారు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
యస్ తుఫాన్ పై ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ కు పిలుపు వచ్చింది. కానీ ఆయన హాజరు కాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయనను రీకాల్ చేసింది. సోమవారం సీఎస్ ఢిల్లీలో రిపోర్టు చేయాల్సి ఉన్నా సీఎం మమతా బెనర్జీ సూచన మేరకు ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో మమత మోదీకి చెక్ పెట్టారని అనుకుంటున్నారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు మమత ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై కేంద్రానికి లేఖ రాయనున్నారు.
సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ ఉద్యోగ విరమణ ఈ రోజే. కనీ ఆయన పదవీ కాలాన్ని మూడు నెలలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన ఉద్యోగ విరమణపై ఉత్కంఠ నెలకొంది. ఎస్ తుపానుపై సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి సీఎస్ హాజరుకానున్నారు. కేంద్రం ఇచ్చిన పొడిగింపును ఆయన ఉపయోగించుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
అఖిల భారత సర్వీసు అధికారులపై కేంద్రం పెత్తనాన్ని మమత జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎస్ ఉద్యోగ కాలం ముగియడంతో ఆయనకు మూడు నెలలు పెంచుతూ నిర్ణయం తీసుకుని ఢిల్లీలో రిపోర్టు చేయాలని ఆదేశించడంతో సీఎం మమతా బెనర్జీ మొకాలడ్డారు. దీంతో విషయం రసకందాయంలో పడింది. ఇద్దరు నేతల మద్య చిక్కుకున్న సీఎస్ భవిష్యత్తు ఏమిటనే దానిపై స్పష్టత లేదు.