మీడియా విలువలు పతనావస్థకు చేరిపోయాయనే ఒక స్థాయి నమ్మకం ప్రజలకు ఏనాడో వచ్చేసింది. అయితే.. అది పతాక స్థాయికి చేరుతున్న పరిస్థితి ఇవాళ తెలుగు మీడియాలో కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా.. ప్రధాన స్రవంతి మీడియాగా పిలుచుకునే సంస్థలు తాము రాజకీయంగా మద్దతు ఇచ్చేవాళ్లకు అనుకూలంగా పనిచేస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా నేపథ్యంలో.. ఆక్సీజన్ లభించక ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇవే మీడియా సంస్థలు ఎవ్వరూ పట్టించుకోవట్లదని కన్నీళ్లు కార్చినంత పనిచేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకోసం తన సొంత డబ్బుతో ఆక్సీజన్ బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు చిరంజీవి. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 30 కోట్ల పైచిలుకు డబ్బులు వెచ్చించి ఈ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు.
ఇందులో చాలా వరకు ప్రజలకు అందుబాటులోకి సైతం వచ్చేశాయి. ఒక్కో ఆక్సీజన్ బ్యాంక్ కోసం దాదాపు 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ఖర్చు అవుతున్నట్టు సమాచారం. ఈ డబ్బులో ఎవరి నుంచి సేకరించిన వివరాళాలు లేవు. కేవలం చిరంజీవి సొంత సొమ్ముతోనే ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఏ విధంగా చూసినా.. ఇది ఎంతో బృహత్తర కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమానికి మీడియా నుంచి స్పందన కరువవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
ప్రధాన మీడియాగా చెప్పుకునే సంస్థలు కనీసంగా కూడా ఈ విషయాన్ని ప్రసారం చేయకపోవడం గమనార్హం. కొన్ని సంస్థలు ఎంటర్ టైన్ మెంట్ న్యూస్ మధ్యలో వేసి వదిలేశాయి. నిజంగా ఒకరు చేసిన సేవను ప్రచారం చేసినప్పుడే.. మరికొందరు ముందుకు వస్తారనేది తెలిసిందే. ఈ కోణంలో చూసినప్పుడైనా ఈ వార్తకు ప్రాచుర్యం కల్పించాల్సి ఉంది. కానీ.. మీడియా ఈ అంశానికి కవరేజ్ ఇవ్వకపోవడం గమనార్హం. అంతేకాదు.. కొన్ని సంస్థలు చిరంజీవిపై బురద జల్లే ప్రయత్నం చేయడం అందరినీ విస్మయ పరిచింది.
ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రభ పత్రికలో ఈ విషయమై కథనం ప్రచురితమైంది. మీడియా వ్యవహరిస్తున్న తీరు.. కోట్లాది మంది చిరు అభిమానుల వేదనను అందులో చర్చించారు. ఈ నేపథ్యంలోనే ధన్యవాదాలు తెలపడానికి ఆంధ్రప్రభ హెడ్ ముత్తా గోపాలకృష్ణకు చిరంజీవి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా మీడియాపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారియి.
ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ.. కొన్ని కోట్ల మంది చిరంజీవి అభిమానుల ఆవేదననే అక్షరీకరించానని చెప్పారు. కనీసం ఒక ఎమ్మెల్యే కానీ.. ఎంపీ కానీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రస్తావించకపోవడం బాధించిందని ఆయన అన్నారు. ఎంతో మంది జనం నుంచి దోచుకుంటున్న డబ్బుల్లో.. కొంత ఖర్చుపెటట్ఇ సేవ పేరుతో ప్రచారం పొందుతుండగా.. మీలాంటి వారు సొంత కష్టార్జితంతో ఇంత మంచి ప్రయత్నం చేసి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని గోపాలకృష్ణ అన్నారు.
దీనికి చిరంజీవి స్పందిస్తూ.. ప్రస్తుతం మీడియా ఇలా ఉండడం మన ఖర్మ అని అన్నారు. ఎవరి ఇంట్రస్ట్ వాళ్లకు ఉండొచ్చు అని అన్న చిరు.. ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని మంచి అని చెప్పకపోగా.. దానిని కూడా చెడుగా చిత్రీకరిస్తూ వార్తలు రాయడం బాధించిందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మీడియా పరిస్థితి ఎలా తయారైందో చెప్పడానికి.. ఈ సంగటనే మంచి ఉదాహరణ అని అంటున్నారు చాలా మంది.