Mamata Banerjee: ‘ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు..’ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సొంత రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇక దేశ వ్యాప్తంగా పాగా వేసేందుకు మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. 2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా మమతా బెనర్జీ ముందుకు వెళ్తున్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒకే రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పావులు కదుపుతున్నారు. మమతా బెనర్జీ ఆలోచనలకు దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహం తోడవడంతో దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక శక్తిగా ఎదిగేందుకు ప్లాన్ వేస్తున్నారు. మోదీ వ్యతిరేక పార్టీలన్నింటి మద్దతు కూడగట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు స్కెచ్ వేస్తున్నారు.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పీఠంపై కూర్చోవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. అందుకు ఇప్పుడు మార్గం వేయనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ పాచిక పారకుండా చేసిన మమతా దేశవ్యాప్తంగా కూడా బీజేపీని ఓడగొట్టాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బలం చూపిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బరిలోకి దిగొచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. ముందుగా గోవా రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఇక్కడ టీఎంసీ సీట్లు పెంచుకుంటే మోదీపై వ్యతిరేకత వచ్చిందని దేశవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. ఈ ప్రణాళిక రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమాచారం.
త్వరలో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ ఇతర పార్టీల మద్దతుతో కమలం పార్టీ పీఠాన్ని చేజిక్కించుకుంది. ఇటీవల బీజేపీపై వస్తున్న వ్యతిరేకతతో గోవాలో కాంగ్రెస్ పుంజుకుంటోంది. అయితే టీఎంసీ సైతం వ్యతిరేక శక్తిగా ఎదిగేందుకు ట్రై చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల మాజీ సీఎం లుజీన్హో పులేరో, టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్, నటుడు నసిఫా అలీ, మిరినాలినీ దేశ్ ప్రభుతో పాటు అనేక మందిని టీఎంసీలో చేర్చుకున్నారు. త్వరలో ఇక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రభావాన్ని బట్టి ఆ తరువాత జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
ఇక దక్షిణాదిన సైతం టీఎంసీ విస్తరించేందుకు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా బీజేపీకి ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటకపై టీఎంసీ దృష్టి పెట్టింది. ఈ రాష్ట్రంలో 2023లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేయించేందుకు మమతా నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ లో అసంతృప్తిలో ఉన్నవారిని చేర్చుకుంటారని అంటున్నారు. అలాగే ఇతర పార్టీల్లోనూ అసంతృప్తితో ఉన్నవారిని చేర్చుకొని తమ పార్టీ కార్యకలాపాలను విస్తరించనున్నారు.
Also Read: KCR vs BJP: బీజేపీని తిట్టిపోసి.. ధాన్యం భారం దించుకొని.. కేంద్రంపైకి డైవర్ట్ చేసిన కేసీఆర్!
ఇప్పటికే సొంత రాష్ట్రంలో బీజేపీని కోలుకోలేని దెబ్బ తీసిన మమతా మిగతా రాష్ట్రాల్లోనూ బీజేపీని ఎదగనీయకుండా పావులు కదుపుతోంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అందుకు వివిధ ప్రణాళికలను రచించనున్నారు. ఇక ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఇప్పటికే బెంగాల్ రాష్ట్రంలో సక్సెస్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా ఎదిగేందుకు ఆయన సేవలను మమతా వినియోగించుకోనున్నారు. కాగా మోదీ వ్యతిరేకత ప్రారంభమైందని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే విపక్షాలను కలుపుకుపోతున్న పార్టీ నాయకులు.. మమత విషయంలో ఎలాంటి స్టెప్ వేయనున్నారనే ఆసక్తి నెలకొంది. అయితే మోదీ ప్రభుత్వం పడిపోతుందంటే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికైనా రెడీ అని మమతా ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే. మొత్తానికి ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఎంసీని జాతీయస్థాయిలో తీసుకెళ్లేందుకు మమతా బెనర్జీ తాజాగా పీకే సహాయంతో భారీ స్కెచ్ లు వేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: Politics: రాష్ట్రంలో తగువులాట.. ఢిల్లీలో నాటకీయత?