https://oktelugu.com/

New Laws: ఇకపై ఆ చట్టాలు కనిపించవు.. వినిపించవు.. భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయం

New Laws: వలసవాద విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని భావిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత ఏడాది చట్టాలను సమూలంగా మార్చింది. అవి జూలై 1 నుంచి అంటే నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 1, 2024 / 10:21 AM IST

    New Criminal Laws

    Follow us on

    New Laws: 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ.. నేటికీ మనదేశంలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలే అమలవుతున్నాయి. ముఖ్యంగా న్యాయవ్యవస్థలో నాటి ఆంగ్లేయులు రూపొందించిన విధానాలే కొనసాగుతున్నాయి. అయితే ఇవన్నీ వలసవాద విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని భావిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత ఏడాది చట్టాలను సమూలంగా మార్చింది. అవి జూలై 1 నుంచి అంటే నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పు వల్ల భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెర లేచింది. బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి(సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టాలు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోనున్నాయి.. వీటి స్థానంలో గత ఏడాది పార్లమెంట్ ఆమోదించిన భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరికత సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్ ఐ ఆర్, పోలీస్ స్టేషన్ కే వెళ్లకుండా అంతర్జాలంలో ఫిర్యాదు నమోదు, ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో సమన్ల జారీ వంటి ఆధునిక మార్పులు కొత్త చట్టాల ద్వారా భారతీయ న్యాయవ్యవస్థలోకి ప్రవేశించాయి.

    అమిత్ షా కీలక పాత్ర

    ఈ చట్టాలను మార్చడంలో, అమల్లోకి తీసుకురావడంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కీలక పాత్ర పోషించారు. ” బ్రిటిష్ పరిపాలన కాలంలో చట్టాల వల్ల ఎక్కువగా శిక్షలు పడేవి. అని మేము న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నాం. అవన్నీ కూడా వలస పాలన నాటి నేర న్యాయ చట్టాలు. వాటి వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్లే వాటిని కాలగర్భంలో కలిపేశాం. కొత్త చట్టాలను భారతీయుల కోసం భారతీయులు మాత్రమే రూపొందించారు. ఈ చట్టాలలో పూర్తిగా భారతీయత నిండి ఉందని” అమిత్ షా వ్యాఖ్యానించారు.

    కొత్త చట్టాల ప్రకారం..

    కొత్త చట్టాల ప్రకారం.. కొత్త క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లో కచ్చితంగా తీర్పు చెప్పాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల లోపే అభియోగాలు నమోదు చేయాలి. ఇక ఈ చట్టాల్లో ఉగ్రవాదాన్ని సమూలంగా అణచివేసేందుకు సరికొత్త నిర్వచనాలు చెప్పారు. వ్యవస్థీకృత నేరాలను పూర్తిగా తొక్కి పెట్టేందుకు సరికొత్త సెక్షన్లను అమల్లోకి తెచ్చారు. రాజద్రోహం అనే పదాన్ని (ఇది బ్రిటిష్ కాలం నాడు స్వాతంత్ర ఉద్యమాన్ని తొక్కేసేందుకు తెరపైకి తెచ్చారు) పూర్తిగా తొలగించారు. అయితే దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి నష్టం చేకూర్చితే.. కఠిన చర్యలు తీసుకుంటారు. ఇక మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణ కోసం సరికొత్త అధ్యాయాన్ని కొత్త చట్టంలో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే, సామూహికంగా చేయరాని పని చేస్తే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధిస్తారు.

    సంక్లిష్టమైన సెక్షన్లు ఉండవు

    నిన్నా మొన్నటి వరకు ఐపీఎస్ లో కొన్ని సెక్షన్లు అత్యంత సంక్లిష్టంగా ఉండేది. వాస్తవానికి జరిగిన నేరం ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుందోననే విషయం పోలీసులకు ఇబ్బందికరంగా ఉండేది. అయితే ఆ సెక్షన్లను ప్రస్తుతం పూర్తిగా సరళ తరం చేశారు. భారతీయ శిక్షాస్మృతిలో 511 సెక్షన్లు ఉన్నాయి. భారతీయ న్యాయ సంహితలో ఆ సెక్షన్ల సంఖ్యను 358కు కుదించారు.. ఇక ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షన్ల మధ్య అనేక నిర్వచనాలు ఉంటే.. వాటన్నింటినీ ఒక సెక్షన్ పరిధిలోకి తీసుకొచ్చారు. 18 సెక్షన్లను సమూలంగా రద్దు చేశారు. ” మూక దాడి, పెళ్లి పేరుతో మహిళలను మోసం చేయడం, చిన్నారులపై సామూహికంగా అత్యాచారం చేయడం” వంటి నేరాలకు ఐపిసి లో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు. ఈ నేపథ్యంలో అటు పోలీసుల్లో, ఇటు న్యాయవాదుల్లో గందరగోళం ఉండేది. అయితే భారతీయ న్యాయ సంహితలో ఆ నేరాల నియంత్రణకు ప్రత్యేక సెక్షన్లను రూపొందించారు.. ఇక తీవ్రమైన నేరాలు, ఇతర దారుణమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు దర్యాప్తులో నిష్పక్షపాతం, వేగవంతం, పకడ్బందీతనం ఉండేందుకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని కచ్చితంగా సందర్శించాలని.. నూతన చట్టంలో పేర్కొన్నారు.