Jammu Kashmir Polls: జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఆ రాష్ట్రంలో కీలక నేతలైన ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ మధ్య మాటల దాడి కొనసాగుతోంది. కాగా, పీడీపీ ఎజెండాను అమలు చేస్తే తాము అభ్యర్థులను నిలబెట్టబోమని ఇటీవల మెహబూబా ముఫ్తీ ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనపై నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ అలయెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పీడీపీ మేనిఫెస్టో ఇప్పటికే ఎన్‌సీ-కాంగ్రెస్ ఎజెండాకు అద్దం పడుతున్నదన్నారు. సీట్ల పంపకం ఏర్పాట్ల కంటే జమ్మూ కశ్మీర్ సమస్యల పరిష్కారానికి తాము ప్రాధాన్యత ఇస్తే పోటీ చేయకుండా కూటమికి మద్దతు ఇవ్వడానికి మెహబూబా సుముఖత వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ లోని గందర్‌బాల్ జిల్లాలో తన ప్రసంగంలో, జేకే మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, “ఎన్‌సి-కాంగ్రెస్ కూటమి తమ ఎజెండాను అంగీకరిస్తే, అభ్యర్థులను పెట్టబోమని ప్రకటించింది. దీనిపైనే ఒమర్ స్పందించారు.ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్తగా అమలు చేయాల్సింది ఏం లేదు.. వారి ఎజెండా కంటే మాదే అత్యుత్తమంగా ఉందంటూ ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ మీరు మా మ్యానిఫెస్టోను అమలు చేస్తున్నారు. ఎన్సీ, కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో అదే మీరు కూడా ప్రస్తావించారు. మీరు ఇక అభ్యర్ధులను బరిలో ఉంచకండి అంటూ సలహా ఇచ్చారు. మీరు మాతో కలిసి రండి.. రేపటి జమ్మూకశ్మీర్ ను అద్బుతంగా తీర్చిదిద్దుకుందాం అంటూ పిలుపునిచ్చారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందజేస్తామని తమ మ్యానిఫెస్టోలో కూడా పెట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కూడా చెప్పాం. అవతల పార్టీ వ్యక్తులు కూడా అవే ప్రతిపాదనలు తెచ్చారు.
జమ్మూకశ్మీర్ సమస్యలను పరిష్కరించే మా ఎజెండాను అమలు చేస్తే నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్ లపై అభ్యర్థులను నిలబెట్టబోమంటూ రెండు రోజుల క్రితం మోహబూబా ముఫ్తీ ప్రతిపాదన తెచ్చారు. అన్ని పనులు చేస్తామంటే మేం కూడా ఆ కూటమికి మద్దతునిస్తాం.. వారిపై అభ్యర్థులను నిలబెట్టబోం అంటూ ఆమె మాటలు చర్చనీయాంశమయ్యాయి,
‘మాకు జమ్మూ కశ్మీర్ మంచి కంటే ఏదీ ముఖ్యం కాదు.. గతంలో బీజేపీతో పొత్తు సమయంలో ఇదే చెప్పాం. కానీ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పొత్తు సందర్భంగా ఎలాంటి ఎజెండా లేదు. కేవలం అధికారమే లక్ష్యంగా పొత్తు పెట్టుకున్నారు.’ అంటూ విమర్శించారు. ఇలాంటి పొత్తు మాకు ఆమోదం కాదు. ఎజెండా లేని పొత్తు వారిది. మాకు ఈ ప్రాంత సమస్యల పరిష్కారమే ముఖ్యమైన ఎజెండా అంటూ ప్రకటించారు.
జమ్ము కశ్మీర్ లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ సెప్టెంబర్ 18, రెండో దశ సెప్టెంబర్ 25, మూడో దశ అక్టోబర్ 1న జరుగుతాయి. అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తంగా 90 అసెంబ్లీ సీట్లలో మొదటి దశలో 24, రెండో దశలో 26, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ప్రస్తుతం జమ్ము కశ్మీర్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సారి పోటీ రసవత్తరంగా కనిపిస్తున్నది. బీజేపీ కూడా ఈ సారి ఈ రాష్ట్ర ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.