AP Politics: ఏపీలో గెలుపు పై ఎవరి అంచనాలు వారివే. విజయం కోసం అధికార, విపక్షాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అదే సమయంలో వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. విపక్షాల మధ్య పొత్తు కుదిరినా ఓట్ల బదలాయింపు జరగదని వైసిపి భావిస్తోంది. ఇప్పుడున్న ఓటింగ్ శాతానికి మిత్రపక్షాల బలం తోడైతే.. సునాయాసంగా గెలుపొందుతానని టిడిపి భావిస్తుంది. తన అవసరం లేనిదే ఏపీలో కొత్త సర్కార్ ఏర్పాటు అయ్యే అవకాశం లేదని జనసేన భావిస్తోంది. వస్తే కొండ.. లేకుంటే వెంట్రుక అన్నట్టు బిజెపి భావన.
సంక్షేమ పథకాలతో తాము బలంగా ఉన్నట్లు వైసిపి భావిస్తోంది. సానుకూల ఓటింగ్ తో మంచి ఫలితాలు అందుకుంటామని ఆశాభావంతో ఉంది. టిడిపి,జనసేన, బిజెపిల మధ్య పొత్తు కుదిరినా సీట్ల వద్ద మడత పేచీ వస్తుందని.. ఒకవేళ పొత్తు కుదిరినాఓట్ల బదలాయింపు జరగదని భావిస్తుంది. టిడిపి అభ్యర్థి నిలబడిన చోట జనసేన కేడర్, జనసేన అభ్యర్థి బరిలో ఉండే చోట టిడిపి కేడర్ సహకరించదని వైసిపి ఆలోచన.
గతం కంటే బలపడ్డామని టిడిపి భావిస్తోంది. ప్రస్తుతం టిడిపి ఓట్ బ్యాంక్ 40 శాతం కాగా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు 10%, మిత్రపక్షాల సాయంతో మరో 10%.. మొత్తం 60 శాతం ఓట్లతో విజయం సాధించగలమని టిడిపి ఆశలు పెట్టుకుంది.
గతం కంటే జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగిందని పవన్ భావిస్తున్నారు. టిడిపి విజయం సాధించాలంటే జనసేన అవసరం అనివార్యమని విశ్లేషణలు సైతం వెలువడుతున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని సీట్లు పెంచుకునేందుకు జనసేన వ్యూహం పన్నుతోంది. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ను కోరుతోంది. ఈ విషయంలో బిజెపి సాయాన్ని తీసుకుంటుంది.
అయితే ఈ విషయంలో బిజెపి ఆలోచన వేరే విధంగా ఉంది. వస్తే కొండ లేకుంటే వెంట్రుకన్న రీతిలో ఆ పార్టీ వ్యవహరిస్తోంది. కూటమిగా వెళ్తే 10, 20 సీట్లు.. లేకున్నా ఒంటరిగా వెళ్లి పార్టీని బలోపేతం చేయడం.. ఏది జరిగినా తన మంచికేనని బిజెపి హై కమాండ్ ఆలోచన చేస్తోంది. ఇలా ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు.