Bigg Boss 7 Telugu: ఎక్కడో బ్రిటన్ లో బిగ్ బ్రదర్ షోగా మొదలైన రియాలిటీ షో ఇండియాలో బిగ్ బాస్ గా ప్రాచుర్యం పొందింది. హిందీలో ప్రయోగాత్మకంగా ప్రసారం చేశారు. విజయం సాధించడంతో అన్ని ప్రాంతీయ భాషలకు పాకింది. 2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా ఫస్ట్ సీజన్ ప్రసారమైంది. ఈ షో పట్ల పెద్దగా అవగాహన లేని తెలుగు ఆడియన్స్ మెల్లగా అలవాటు పడ్డారు. క్రేజీ షోగా అవతరించింది. ఛానల్ కి కాసులు కురిపిస్తుండగా ఎన్ని విమర్శలు వచ్చినా మేకర్స్ వెనుకాడటం లేదు.
బిగ్ బాస్ షోలో సెలెబ్రిటీలైన అమ్మాయిలు, అబ్బాయిలు కంటెస్ట్ చేస్తారు. నాలుగు గోడల మధ్య బాహ్యప్రపంచానికి దూరంగా బ్రతికే క్రమంలో ఒకరికొకరు దగ్గరవుతున్నారు. యువతీ యువకుల మధ్య లవ్, రొమాన్స్ కామన్ అయ్యాయి. దానికి తోడు నిర్వాహకుల టాస్కుల్లో ఆడా మగా తేడా లేకుండా పోటీ పడతారు. ఒకే కంచంలో తినడం, మంచంలో పడుకోవడం… చెప్పాలంటే బిగ్ బాస్ లో అభ్యంతరకర కంటెంట్ చాలా ఉంది. అందుకే సాంప్రదాయవాదులు బిగ్ బాస్ షో రద్దు చేయాలని పట్టుబడుతున్నారు.
ప్రతిసారి షో ప్రారంభానికి ముందు నిరసనలు, కోర్టులో కేసులు పరిపాటిగా మారింది. సిపిఐ నేత నారాయణరావు హోస్ట్ నాగార్జునను, కంటెస్టెంట్స్ ని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు సార్లు నిరసనకారులు నాగార్జున ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఎన్ని జరిగినా షో ఆగింది లేదు. 6 సీజన్స్ సక్సెస్ఫుల్ గా ముగిశాయి. మరో నెలలో సీజన్ 7 ప్రారంభం కానుంది.
అయితే బిగ్ బాస్ షోపై కోర్టులో పిటీషన్స్ ప్రచారం కోసమేనా అనే సందేహం కలుగుతుంది. ప్రతిసారి ఇదే జరుగుతుంటే అనుమానం వస్తుంది. కారణం ఈ కోర్టు పిటీషన్స్ వలన ఒరిగిందేమీ లేదు. బిగ్ బాస్ షో నిషేధం పక్కన పెడితే కనీసం ఆంక్షలు విధించిన దాఖలాలు లేవు. అపరిమిత కంటెంట్ తో బిగ్ బాస్ షో సాగుతుంది. ఈ క్రమంలో కోర్ట్ కేసులు, నిరసనలు, వివాదాలు షోకి ప్రచారం కల్పించడానికే అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. గతంలో కూడా కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి బిగ్ బాస్ షో నిలిపివేయాలంటూ కేసులు వేయడమైంది. ఈసారి కోర్టు స్పందించింది. బిగ్ బాస్ షోకి కూడా సెన్సార్ ఉండాలి. షో ముగిశాక చర్యలు తీసుకుని ప్రయోజనం లేదని అభిప్రాయపడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, స్టార్ మా ఇండియాతో పాటు హోస్ట్ నాగార్జునకు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు పంపింది. మరి త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.