Homeజాతీయ వార్తలుMaharashtra MLC Elections: 9కి 9 సీట్లు.. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కూటమి సంచలనం!

Maharashtra MLC Elections: 9కి 9 సీట్లు.. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కూటమి సంచలనం!

Maharashtra MLC Elections: మహారాష్ట్రలో ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో 11 సీట్లకు శుక్రవారం పోలింగ్‌ జరిగింది. ఇందులో పోటీ చేసిన 9 స్థానాలను బీజేపీ కూటమి నిలబెట్టుకుంది. ఇందులో ఐదుగురు బీజేపీ అభ్యర్థులు కాగా, నలుగురు సీఎం ఏక్‌ నాథ్‌ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన చెరో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు.

పీడబ్ల్యూపీ అభ్యర్థి ఓటమి..
ఇక ఈ ఎన్నికల్లో విపక్షాల మహావికాస్‌ అఘాడీలో శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే సన్నిహితుడు మిలింద్‌ నార్వేకర్, కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రద్యా్న సతవ్‌ విజయం సాధించారు. ఎన్సీపీ శరద్‌ పవార్‌ తమ అభ్యర్థిని బరిలో నిలపలేదు. పీడబ్ల్యూపీ అభ్యర్థి జయంత్‌ పాటిల్‌కు మద్దతు ఇచ్చారు. అయితే ఆయన ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. శాసనమండలిలో 11 మంది ఎమ్మెల్సీల పదవీకాలం జులై 27తో పూర్తికానున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.

బలం లేకపోయినా బరిలో..
ఇదిలా ఉంటే.. బీజేపీ కూటమిలో చీలిక తెచ్చేందుకు మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12వ అభ్యర్థిని బరిలో దించారు. తమకు బలం లేదని తెలిసిన కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ కూటమిలో చీలిక తెచ్చి కూటమిలో ఐక్యత లేదని నిరూపించాలని భావించారు. కానీ, అధికార బీజేపీ కూటమి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లింది. ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి ఉద్ధవ్‌ థాక్రేకు షాక్‌ ఇచ్చింది.

లోక్‌సభ ఎన్నికల్లో వెనుకబాటు..
ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమికి ఆశించిన స్థానాలు దక్కలేదు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లోను దెబ్బ తింటుందని విపక్ష నేత ఉద్ధవ్‌ థాక్రే భావించారు. కానీ, ఎమ్మెల్సీ ఫలితాలు కూటమిలో కొత్త జోష్‌ నింపినట్లయింది. పోటీ చేసిన తొమ్మిదింట తొమ్మిది స్థానాలు కైవసం చేసుకున్నామని డిప్యూటీ సీఎం దేవేంద్రఫడ్నవీస్‌ తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ ఏడాది చివరన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో విజయం సాధిస్తామని డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ధీమా వ్యక్తం చేశారు.

విజేతలు వీరే..
ఇక మ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినవారిలో.. బీజేపీ నుంచి మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజా ముండే, యోగేశ్‌ తిలేకర్, పరిణయ్, అమిత్‌ గోర్ఖే, సదాభావు ఖోట్‌ ఉన్నారు. శివసేన నుంచి మాజీ ఎంపీలు కృపాల్‌ తుమానే, భావనా గవాలీ, ఎన్సీపీ నుంచి శివాజీరావు గార్జే, రాజేశ్‌ విటేకర్‌ ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు. కాగా, ఎన్నికల సమయంలో క్రాస్‌ ఓటింగ్‌ భయంతో ఆయా పార్టీలు రిసార్టు రాజకీయాలకు దిగడం గమనార్హం.

అసెంబ్లీ ఎన్నికలు ఈజీనా..
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో కూటమిలో జోష్‌ కనిపిస్తున్నా… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అంత ఈజీ కాదంటున్నారు. విశ్లేషకులు ఇందుకు కారణం కూడా చెబుతున్నారు. ప్రజల్లో బీజేపీ కూటమి బలం తగ్గిందని పేర్కొంటున్నారు. ఇందుకు ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన సీట్లే నిదర్శనమంటున్నారు. బీజేపీ కూటమి ఏకపక్ష నిర్ణయాలు, గతంలో ఏర్పడిన ప్రభుత్వం కూల్చడం వంటి కారణాలను ప్రజలు విస్మరించలేదని గుర్తుచేస్తున్నారు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

సమస్యలు, అభివృద్ధి..
ఇదే విధంగా వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలోని అనేక సమస్యలు, అభివృద్ధి కూడా ప్రభావింత చేస్తాయంటున్నారు. షిండే ప్రభుత్వం ఆశించిన మేర అభివృద్ధి చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక అనేక సమస్యలతో మహారాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రైతులు మద్దతు ధర లేక నష్టపోతున్నారు. ఇవి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని అంటున్నారు. రాబోయే ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై అధికార కూటమి విసయావకాశాలు ఆధారపడి ఉంటాయని పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular