Jagananna Arogya Suraksha: వైసిపి అధికార మదానికి అంతేలేకుండా పోతోంది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతి చోటా తమ ముద్రను ఉండాలని బలంగా కోరుకుంటారు. ఇక రంగుల పిచ్చికి కొదువే లేదు. బడి, గుడి.. చివరికి స్మశానవాటికలను సైతం తమ పార్టీ రంగులతో నింపేస్తారు. తాజాగా ఏపీలో పేరు మోసిన దేవస్థానంలో ఒకటైన మహానంది ఆలయ మైక్ సెట్ లో జగనన్న మాట వినిపించింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది శైవక్షేత్రముగా బాసిల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శివరాత్రి, కార్తీకమాసంలోని పర్వదినాల్లో అయితే చెప్పనక్కర్లేదు.నిత్యం ఆధ్యాత్మికతతో పరిఢవిల్లుతోంది. అటువంటి క్షేత్రంలో అపచారం జరిగింది. ఇందుకు వైసీపీ నేతలు, కొందరు అధికారుల తీరే కారణం.
వైసిపి ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మంగళవారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల శిబిరాన్ని వాయిదా వేశారు. ఈ నెల 27న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అప్పటికే ప్రచారం జరగడంతోఒక వినూత్న ఆలోచన చేశారు. ఏకంగా దేవస్థానం మైక్ సెట్ లోనే జగనన్న ఆరోగ్య సురక్ష వాయిదా పడింది అంటూ ప్రకటన చేశారు. దీనిపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మహా క్షేత్రంలో రాజకీయాలు తగునా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి వద్ద ప్రస్తావిస్తే.. ఆలయ మైక్ లో ఈ విధంగా ప్రచారం చేయడం తప్పేనని.. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.