Medigadda Barrage: మేడిగడ్డ పై సర్కారు ఎందుకు భయపడుతోంది? నిజాల్ని ఎందుకు దాస్తోంది?

వాస్తవానికి మేడిగడ్డ ప్రాజెక్టు గేట్ల బరువును ఆపే స్తంభాల వంటి నిర్మాణాలు (పీర్) ఒక్కొక్కటి 110 మీటర్ల పొడవు, 25 మీటర్ల ఎత్తున కాంక్రీట్ తో నిర్మించారు. ఇంత భారీగా నిర్మించిన పీర్ లలో ఒకటి ఇప్పుడు కుంగిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 25, 2023 12:50 pm

Medigadda Barrage

Follow us on

Medigadda Barrage: ఎన్నికలవేళ అధికార భారత రాష్ట్ర సమితికి మేడిగడ్డ రూపంలో మరొక తలనొప్పి మొదలైంది. ఇప్పటికే కాలేశ్వరం ఎత్తిపోతల పథకం అధికార పార్టీకి ఏటీఎం లాగా మారిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. మేడిగడ్డ ఎత్తిపోతల పథకానికి సంబంధించి నిర్మించిన బరాజ్ కొంతమేర కుంగిపోవడం అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. గుజరాత్లో బ్రిడ్జి కూలిపోలేదా? వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పంజాగుట్ట ఫ్లై ఓవర్ కూలిపోలేదా? అని కాంగ్రెస్, బీజేపీ లకు భారత రాష్ట్ర సమితి నాయకులు కౌంటర్ ఇస్తున్నారు కానీ.. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. కాలేశ్వరం ప్రాజెక్టు మానవ నిర్మిత అద్భుతం కాదని, అది కూడా కుంగిపోతుందని తాజాగా తేలింది. ” 7 బూర్జ్ ఖలీఫా లకు సరిపడా కాంక్రీట్, 15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడా ఉక్కు, ప్రపంచంలో అతిపెద్దదైన గీజా పిరమిడ్ వంటి ఆరు పిరమిడ్ల పరిమాణంతో తవ్విన మట్టి, 72 గంటల్లో 25,584 ఘనపు మీటర్ల కాంక్రీట్ పోసి గిన్నిస్ రికార్డు” గడ్డ బరాజ్ నిర్మాణ ఘనత గురించి దాని కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టి అప్పట్లో ఈ మాటలు చెప్పింది..

వాస్తవానికి మేడిగడ్డ ప్రాజెక్టు గేట్ల బరువును ఆపే స్తంభాల వంటి నిర్మాణాలు (పీర్) ఒక్కొక్కటి 110 మీటర్ల పొడవు, 25 మీటర్ల ఎత్తున కాంక్రీట్ తో నిర్మించారు. ఇంత భారీగా నిర్మించిన పీర్ లలో ఒకటి ఇప్పుడు కుంగిపోయింది. 20వ నెంబర్ పీర్ మాత్రమే కుంగింది అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అయితే ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అక్కడి ప్రత్యక్ష సాక్షులు మాత్రం గత శనివారం నుంచి కుంగడం ప్రారంభమైంది అని చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను మొత్తం రహస్యంగా ఉంచుతున్నారు. మీడియాను అటువైపు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. గతంలో కాలేశ్వరం పంపు హౌస్ లు మునిగినప్పుడు కూడా మీడియాను అనుమతించలేదు. ఇప్పుడు కూడా సర్కార్ అదే తీరుగా గోప్యత పాటిస్తోంది. అయితే తాజాగా ఇందులో కుట్ర కోణం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు మహాదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ప్రాజెక్టు పీర్ ల దగ్గర బాంబుల మోత వినిపించిందనే వాదనలు లేక పోలేదు. 2016 మే నెలలో శంకుస్థాపన చేసుకున్న ఎత్తిపోతల పథకం.. 2019 జూన్ లో పూర్తయింది. నిర్మాణానికి ప్రభుత్వం 1850 కోట్లు ఖర్చు చేసింది. 16 టీఎంసీల నీరు ఇందులో నిల్వ ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి 85 గేట్లు నిర్మించింది. రెండు సంవత్సరాల లోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేశామని నిర్మాణ సంస్థ గొప్పగా ప్రకటించుకుంది.

మేడిగడ్డ బరాజ్ మాత్రమే కాదు వంతెన కూడా. ఇది తెలంగాణ, మహారాష్ట్రలను కలుపుతుంది. 1.6 కిలోమీటర్లు. ఇప్పుడు జరిగిన ఈ ఘటనతో మేడిగడ్డలో నీళ్లు ఆపే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి ఉన్న నీరు మొత్తం ఖాళీ చేశారు. దీంతో ప్రాణహిత నుంచి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు గాని.. ఆ నీటిని వెనక్కు తోడి సుందిళ్ల, అన్నారం దగ్గరకు మళ్లించి అక్కడి నుంచి తోడి నీరు ఇవ్వడానికి సాధ్యం కాదని సాగు నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. అంటే మొత్తం ప్రాజెక్టు ప్రయోజనానికి గండి పడే ప్రమాదం ఉంది. అయితే మేడిగడ్డ అంతా పటిష్టంగా నిర్మించినప్పటికీ ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వం సూచించిన దాని ప్రకారమే తాము ఈ కట్టడం నిర్మించామని నిర్మాణ సంస్థ చెబుతోంది. ” కచ్చితంగా పునాదుల నిర్మాణంలో లోపం వల్లే ఇలా జరిగింది. ఫౌండేషన్ సరిగా చేయలేదు. అందులో లోపం ఉంది. దాని వల్ల కొంతకాలంగా కొంచెం కొంచెం ఫౌండేషన్ కింద ఉన్న ఇసుక కొట్టుకుంటూ పోయి ఇప్పుడు కుంగిపోయింది. రాతి పునాది వేరు. మేడిగడ్డ పూర్తిగా ఇసుక పునాది. ఇసుకలో పునాది నిర్మాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. రాజమండ్రి దగ్గర ధవలేశ్వరం ఇసుక పునాది అయినప్పటికీ బలంగా ఉంది. కానీ ఇక్కడ నిర్మాణ దశలో జాగ్రత్తలు పాటించలేదని స్పష్టంగా తెలుస్తోంది” అని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.