Madhya Pradesh Elections: ఉచిత విద్యుత్.. క్రికెట్ ప్రీమియర్ లీగ్.. కావేవీ ఎన్నికల హామీలకు అనర్హం!

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి.. అధికారం దక్కించుకోవాలి. అందుకోసం ఎలాంటి హామీలైనా ఇద్దాం.. వాటి అమలుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్నది తరువాత చూసుకుందాం. ఇదీ.. మధ్య ప్రదేశ్ లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి అవలంబిస్తున్న విధానం.

Written By: Anabothula Bhaskar, Updated On : October 18, 2023 11:16 am

Madhya Pradesh Elections

Follow us on

Madhya Pradesh Elections: ఒక ఉత్పత్తిని ఒక కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టే ముందు.. వినియోగదారుల ఆదరణ చురగొనేందుకు ఆఫర్లు ప్రకటిస్తుంది. ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటూ ఊదరగొడుతుంది. ఇదే సమయంలో పోటీ కంపెనీలు ఆర్థికంగా ఇబ్బంది పడే విధంగా మరిన్ని రాయితీలు ఇస్తుంది. తన ఉత్పత్తి క్లిక్ అయిన తర్వాత అప్పటివరకు ఇచ్చిన రాయితీలను మొత్తం ఎత్తేస్తుంది. ఎలాగూ ఆ ఉత్పత్తికి అలవాటు పడి ఉంటారు కాబట్టి జనం కూడా చచ్చినట్టు కొంటారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా ఇదే విధానం కొనసాగుతోంది. అధికారంలో రాకముందు అలవి కాని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కిందా మీదా పడి అమలుచేసి.. ఉచిత పథకాలకు జనం అలవాటు పడే విధంగా చేసి.. తమ అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార,ప్రతిపక్ష అనే తేడా లేకుండా పార్టీలు అడ్డగోలుగా హామీలు ఇస్తున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అధికార భారత రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఓటర్ల మీద వరాల వర్షం కురిపించాయి. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ కూడా ఉంది కాబట్టి.. అక్కడ కూడా కాంగ్రెస్ పోటీ చేస్తుంది కాబట్టి.. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే ఆరు గ్యారెంటీల పథకాలను తెరపైకి తీసుకువచ్చిందో.. అక్కడ కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది. త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. చేతికి ఎముక లేదు అన్న తీరుగా ఉచితాల మీద ఉచితాలు ప్రకటించింది.

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి.. అధికారం దక్కించుకోవాలి. అందుకోసం ఎలాంటి హామీలైనా ఇద్దాం.. వాటి అమలుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్నది తరువాత చూసుకుందాం. ఇదీ.. మధ్య ప్రదేశ్ లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి అవలంబిస్తున్న విధానం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వాస్తవ రాబడులు, ఆదాయ మార్గాలను పరిగణనలోకి తీసుకోకుండానే పార్టీలు ఒకదానిని మించి మరొకటి హామీలు గుప్పిస్తున్నాయి. అధికారంలోకి వస్తే వీటిని అమలు చేయడం సాధ్యమవుతుందా? అన్నది కూడా పరిశీలనలోకి తీసుకోవడం లేదు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ హామీల వర్షం కురిపించింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. ఓబీసీలకు 27% రిజర్వేషన్‌.. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ.. రూ.500కే వంటగ్యాస్‌.. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం వంటి వాగ్దానాలు చేసింది. మధ్యప్రదేశ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) జట్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.

106 పేజీల మేనిఫెస్టోను రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ మంగళవారం విడుదల చేశారు. ‘కాంగ్రెస్‌ వస్తుంది.. సంతోషం తెస్తుంది’ తమ నినాదమని చెప్పారు. రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలతో పాటు రైతుల విద్యుత్‌ బకాయిల మాఫీ, ఆందోళనల సందర్భంగా రైతులపై పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేత, 5 హెచ్‌పీ వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్‌, ఇళ్లకు 200 యూనిట్ల వరకు సగం చార్జీ మాత్రమే వసూలు వంటివి మేనిఫెస్టోలో ఇతర ప్రధాన హామీలు. తాము అధికారంలోకి వస్తే ఓపీఎస్ ను పునరుద్ధరిస్తామని కమల్‌నాథ్‌ హామీ ఇచ్చారు.
తెలంగాణ సహా ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ గఢ్‌, రాజస్థాన్‌, మిజోరాం రాష్ట్రాల్లో తమ పార్టీయే గెలుస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తామిచ్చిన ఆరు గ్యారెంటీలు.. తమకు తిరుగులేని విజయం అందిస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుందని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌, కర్ణాటక, ఛత్తీస్ గఢ్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ఈమేరకు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అవినీతి ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ కూల్చివేస్తుందన్నారు. మిజోరాంను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్‌ వద్ద ఒక సరైన ప్లాన్‌ ఉందన్నారు.