Lawyer Sidharth Luthra: చంద్రబాబుకు బెయిల్ తెప్పించని లూథ్రా.. కొత్త లాయర్ కోసం టీడీపీ వెతుకులాట

సిద్ధార్థ్ దేశంలోనే ప్రముఖ న్యాయవాది. సుప్రీంకోర్టులో పేరున్న న్యాయవాదుల్లో ఈయన ఒకరు. అత్యధిక ఫీజు తీసుకునే న్యాయవాదుల్లో ఈయన ముందుంటారని ప్రచారం జరుగుతోంది.

Written By: Dharma, Updated On : September 11, 2023 2:41 pm

Lawyer Sidharth Luthra

Follow us on

Lawyer Sidharth Luthra: చంద్రబాబు బెయిల్ పై బయటకు వస్తారని తెలుగుదేశం పార్టీ బలంగా విశ్వసించింది. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. కోర్టు ఏకంగా 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. వాస్తవానికి లాయర్ సిద్దార్థ్ లూథ్రా చంద్రబాబు తరఫున వాదించడంతో తప్పకుండా బెయిల్ లభిస్తుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావించాయి. ఇప్పటివరకు సిద్ధార్థ్ వాదించిన కేసులు వీలైనంత వరకు అనుకూల జడ్జిమెంట్లు వచ్చాయి. అందుకే టిడిపి నాయకత్వం సైతం ఆయన ప్రత్యేకంగా రప్పించింది. కానీ ఫలితం లేకపోయింది.

సిద్ధార్థ్ దేశంలోనే ప్రముఖ న్యాయవాది. సుప్రీంకోర్టులో పేరున్న న్యాయవాదుల్లో ఈయన ఒకరు. అత్యధిక ఫీజు తీసుకునే న్యాయవాదుల్లో ఈయన ముందుంటారని ప్రచారం జరుగుతోంది. ఈయన ఢిల్లీ కాకుండా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో కేసు వాదించడానికి రోజుకు 1.5 కోట్ల రూపాయలు ఫీజుగా తీసుకుంటారని టాక్ నడుస్తోంది. దీనికి తోడు ఆయనకు స్పెషల్ ఫ్లైట్, లగ్జరీ కారు సమకూర్చాల్సి ఉంటుంది. పేరు మోసిన హోటల్లో బస్సు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అటువంటి లాయర్ ను తెచ్చినా సానుకూలమైన తీర్పు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం పునరాలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం విజయవాడ సిఐడి కోర్టులో సిద్ధార్థ్ వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబుకు హౌస్ అరెస్టునే రిమాండ్ గా మార్చాలని న్యాయమూర్తిని కోరుతున్నారు. అందుకు గల కారణాలను కోర్టుకు వివరించే పనిలో ఉన్నారు. అయితే చంద్రబాబు రిమాండ్ ఈనెల 22న ముగియనున్న నేపథ్యంలో.. తదుపరి ఎలా ముందుకెళ్లాలనే దానిపై టిడిపి నాయకత్వం ఆలోచిస్తుంది. సిద్ధార్థ కంటే మెరుగైన లాయర్లను కేసు వాదనకు తీసుకొచ్చే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేశంలో పేరు మోసిన లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే సిద్ధార్థ్ సేవలు టిడిపికి కొత్త కాదు. గతంలో కూడా ఆయన సేవలను వినియోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో అమరావతి భూములు కేసులను ఆయనే వాదించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు సంబంధించి ఏ కేసులైనా సిద్ధార్థ్ చూసుకుంటారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వివేకానంద హత్య కేసులకు సంబంధించి సునీత తరపున సిద్ధార్థ్ వాదనలు వినిపించారు. అయితే చంద్రబాబు తాజా కేసు ప్రతిష్టాత్మకం కావడంతో తెలుగుదేశం పార్టీ అన్ని జాగ్రత్తలను తీసుకుంటుంది. ఆయనతోపాటు మరికొందరు ప్రముఖ లాయర్లను రంగంలో దించాలని భావిస్తోంది.

అయితే చంద్రబాబు కేసు విషయంలో ఏపీ సిఐడి దూకుడు మీద ఉంది. వైసీపీ సర్కార్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తోందని వార్తలు వస్తున్నాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కేసును సానుకూలంగా మార్చుకోవాలని టిడిపి భావిస్తోంది. 22 తో చంద్రబాబు రిమాండ్ పూర్తికానున్న నేపథ్యంలో… తదుపరి విచారణలో బలమైన వాదనలు వినిపించాలని భావిస్తోంది. అందుకు సంబంధించి న్యాయ కోవిదులను, న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే టిడిపి అగ్రనాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది.