
యుద్ధానికి సిద్ధం అవుతున్న వేళ కత్తులు కటార్లు అన్నీ రెడీ చేసుకుంటారు. ఇప్పుడు ఇన్నాళ్లు ఒంటరిగా ఏపీలోని అధికార, ప్రతిపక్షాలతో ఫైట్ చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. తాజాగా తన టీంను రెడీ చేసుకున్నారు. పటిష్టమైన సైన్యంతో ఇప్పుడు ఏపీ రాజకీయ కురుక్షేత్రంలో దిగబోతున్నారు. 2024లో అధికారమే లక్ష్యంగా సోము వీర్రాజు తాజాగా రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించారు. ఫైర్ బ్రాండ్ లకు చోటు కల్పించారు.
Also Read: ఆంధ్రజ్యోతి యూటర్న్…. ఇంతకు మించిన సాక్ష్యం అవసరమా…?
2024 ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జాతీయ పార్టీ కొత్త అధ్యక్షుడిని నియమించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎంపికైనప్పటి నుంచి పార్టీని గాడినపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతపై ఎప్పటికప్పుడు పోరాడుతున్నారు. ఇటీవల జరిగిన అంతర్వేది ఘటనపైనా తనదైన శైలిలో పార్టీ నేతలను రంగంలోకి దింపారు. దీక్షలు చేస్తూనే.. ఆలయానికి వచ్చిన మంత్రులను, ప్రభుత్వ పెద్దలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరోసారి బీజేపీ ప్రజల్లోకి వెళ్లి తన సత్తాను చాటింది.
తాజాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. తన టీంను రెడీ చేసుకున్నారు. కొత్త రాష్ట్ర పదాధికారులను ప్రకటించారు. కొత్త కార్యవర్గం అంకితభావంతో పనిచేసి రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసి అధికారం దిశగా నడిపించేలా కృషి చేయాలని సోము పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ బూత్‌స్థాయి నుంచి అమలయ్యేలా చూడాలని సూచించారు.
Also Read: చినబాబు ఆశ ఎప్పటికీ నెరవేరదా…?
కార్యవర్గంలో ప్రధానంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు నియామకం అయ్యారు. జనరల్ సెక్రటరీలుగా పాతూరి నాగభూషణం, ఎం.సుధాకర్‌యాదవ్, స్పోక్స్ పర్సన్‌గా చందు సాంశివరావును నియమిస్తూ సోము వీర్రాజు ఆదివారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
నూతన పదాధికారులకు, వివిధ మోర్చాల నూతన అధ్యక్ష్యులకు శుభాకాంక్షలు. రాజకీయాల్లో ఉత్సాహంతో, శక్తిసామర్ధ్యాలను జోడించి పార్టీ అభివృద్ధికి నిరంతరకృషి , పట్టుదలతో పనిచేసి రాష్ట్ర అభివృద్ధిలో, రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తారని ఆకాంక్షిస్తూ – మీ సోము వీర్రాజు pic.twitter.com/YHK1E7sKUY
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) September 13, 2020