
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ బలం పెరిగింది. చైర్మన్ కూడా వైసీపీ నాయకుడే అయ్యారు. దీంతో ఆ పార్టీకి మరింత జవసత్వాలు పెరిగాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కు మండలిలో చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రభుత్వంపై ఎగిరిపడిన లోకేష్ కు బలం తగ్గిపోయింది. మండలిలో ఇటీవల నియామకం చేసిన సభ్యుల సంఖ్యతో వారి బలం రెట్టింపయింది. టీడీపీ సంఖ్య తగ్గిపోయింది. పైగా ఇన్నాళ్లు మండలి చైర్మన్ టీడీపీ వ్యక్తి కావడంతో ఏం చేయలేకపోయారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
శాసనసభలో సైతం వైసీపీకి 151 ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీలోకి వలస వచ్చిన వారితో కలిపి 156 కు పెరిగింది. దీంతో శాసనసభలోసైతం టీడీపీ పప్పులు ఉడకం లేదు. బిల్లుల విషయంలో వైసీపీదే పైచేయి. ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో వైసీపీ తీసుకునే నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయి. ఫలితంగా టీడీపీ దిష్టిబొమ్మ పాత్ర పోషించాల్సి వస్తోంది. మూడు రాజధానులు, సీఆర్టీఏ బిల్లుల విషయంలో కూడా మండలిలో టీడీపీ, వైసీపీ మధ్య గొడవ జరిగినా చివరికి మాత్రం వైసీపీదే విజయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా వైసీపీని నిలువరించలేదని పలవురు చెబుతున్నారు.
నారా లోకేష్ మండలిలో వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో వైసీపీ పంతం నెగ్గించుకునే అవకాశం కలిగింది. లోకేష్ దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు సంఖ్యా బలం చూసుకుని చెలరేగిన లోకేష్ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నందున ఇక లోకేష్ ఆటలు సాగవనే విషయం స్పష్టమవుతోంది. అందుకే ఆయన కూడా ఇప్పుడు పెదవి విప్పడం లేదని తెలుస్తోంది.
లోకేష్ ఇప్పటికి కూడా ఏ చిన్న చాన్స్ వచ్చిన వదులుకోవడం లేదు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనిలో భాగంగా అన్ని దారులు వెతుక్కుంటున్నారు. ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు తనగళం విప్పుతున్నారు. వైసీపీకి ఉన్న బలంతో లోకేష్ ఒక్కడు మాత్రం ఏం చేయగలరు. వైసీపీ కూడా లోకేష్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.