https://oktelugu.com/

రెండుక‌ళ్ల సిద్ధాంతికి.. మూడో స‌మ‌స్య‌!

‘‘హీరో, విల‌న్ కొట్టుకొని.. క‌మెడియ‌న్ మీద ప‌డిపోయిన‌ట్టు.. మ‌ధ్య‌లో నా మీద‌కొస్తారేంటీ?’’ అని ఓ సినిమాలో డైలాగు ఉంది. ఇప్పుడు తెలుగు త‌మ్ముళ్లు ఇదే డైలాగును గుర్తుచేసుకుంటున్నారు! తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం తార‌స్థాయికి చేరుతోంది. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులు అక్ర‌మంగా నిర్మిస్తున్నారంటూ.. తెలంగాణ మంత్రులు విమ‌ర్శ‌లు చేయ‌డంతో మొద‌లైన వివాదం.. చినికి చినికి గాలివాన‌గా మారింది. ఏపీకి వ్య‌తిరేకంగా ప్రాజెక్టుల్లో ఉన్న నీటితో విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తోంది తెలంగాణ స‌ర్కారు. దీనిపై లేఖ‌ల […]

Written By: , Updated On : July 4, 2021 / 06:53 AM IST
Follow us on

‘‘హీరో, విల‌న్ కొట్టుకొని.. క‌మెడియ‌న్ మీద ప‌డిపోయిన‌ట్టు.. మ‌ధ్య‌లో నా మీద‌కొస్తారేంటీ?’’ అని ఓ సినిమాలో డైలాగు ఉంది. ఇప్పుడు తెలుగు త‌మ్ముళ్లు ఇదే డైలాగును గుర్తుచేసుకుంటున్నారు! తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం తార‌స్థాయికి చేరుతోంది. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులు అక్ర‌మంగా నిర్మిస్తున్నారంటూ.. తెలంగాణ మంత్రులు విమ‌ర్శ‌లు చేయ‌డంతో మొద‌లైన వివాదం.. చినికి చినికి గాలివాన‌గా మారింది. ఏపీకి వ్య‌తిరేకంగా ప్రాజెక్టుల్లో ఉన్న నీటితో విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తోంది తెలంగాణ స‌ర్కారు. దీనిపై లేఖ‌ల యుద్ధం చేస్తోంది జ‌గ‌న్ స‌ర్కారు. కృష్ణాబోర్డుకు, ప్ర‌ధానికి లేఖ‌లు రాశారు. ఈ విధంగా.. రెండు రాష్ట్రాల మ‌ధ్య పంచాయితీ గ‌ట్టిగానే సాగుతోంది.

ఇంత జ‌రుగుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ల్లెత్తు మాట మాట్లాడ‌లేదు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న హ‌యాంలోనూ జ‌ల జ‌గ‌డం రెండు రాష్ట్రాల మ‌ధ్య ఏ స్థాయిలో కొన‌సాగిందో తెలిసిందే. అప్పుడు ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం తీవ్రంగా యుద్ధం చేసిన బాబు.. ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నార‌నే చ‌ర్చ మొద‌లైంది. రోజురోజుకూ ప‌రిస్థితి ముదురుతున్నా.. చంద్ర‌బాబు మౌన‌వ్ర‌తాన్నే ఆశ్ర‌యించ‌డం వ‌ల్ల పార్టీకి ఎలాంటి డ్యామేజీ జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న త‌మ్ముళ్ల‌లో మొద‌లైంది.

ఈ విష‌యంలో త‌న‌ది వ్యూహాత్మ‌క మౌన‌మేన‌ని తొలుత‌ చంద్ర‌బాబు సంకేతాలిచ్చారు. త‌ద్వారా.. జ‌గ‌న్-కేసీఆర్ రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే ఉత్తుత్తి పంచాయితీ పెట్టుకుంటున్నార‌ని ప‌రోక్షంగా చెప్ప‌జూశారు. అందుకే.. ఆయ‌న ఏమీ మాట్లాడ‌లేదు. పార్టీ నేత‌ల‌కు సైతం ఈ మేర‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. మొత్తంగా.. టీడీపీ నుంచి ఎవ్వ‌రూ స్పందించ‌లేదు. కానీ.. ఇటు పంచాయితీ మాత్రం పెరిగిపోతోంది. రెండు రాష్ట్రాలు నువ్వా? నేనా? అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. అస‌లే.. ఇది రెండు రాష్ట్రాల‌ రైతులు, ప్ర‌జ‌ల‌కు సంబంధించిన అంశం. ఇలాంటి విష‌యంలో మౌనంగా ఉంటే ఎలా అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

అలాగ‌ని చెప్పి ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే.. మిగిలిన రాష్ట్రంలో న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. ఏపీకి స‌పోర్టుగా ఉంటే.. తెలంగాణ‌లో ఇప్ప‌టికే ఊగిస‌లాడుతున్న పార్టీని పూర్తిగా కోల్పోవాల్సి వ‌స్తుంది. తెలంగాణ త‌ర‌పున మాట్లాడితే.. ప్ర‌తిప‌క్ష స్థానం శాశ్వ‌తం చేసుకోవాల్సి వ‌స్తుందేమోన‌న్న భ‌యం ఉంది. పోనీ.. మ‌ధ్య‌స్తంగా ఉందామంటే.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో చెప్పిన రెండు క‌ళ్ల సిద్ధాంతం అభాసుపాలైన విధంగా ప‌రిస్థితి త‌యార‌వుతుంది. ఈ సైలెన్స్ కంటిన్యూ చేద్దామంటే.. రేపొద్దున్న రాయ‌ల‌సీమ ప్రాంతంలో ప్ర‌జ‌ల‌ను ఓట్లు ఎలా అడుగుతామ‌నే భ‌యం కూడా త‌మ్ముళ్ల‌లో ఉంది. అస‌లే.. బాబు కూడా రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన మ‌నిషి కావ‌డం మ‌రో అంశం. సొంత ప్రాంతానికి నీళ్ల స‌మ‌స్య వ‌స్తే కూడా ప‌ట్టించుకోలేద‌ని స్థానికులు అడిగితే ఏం చెప్పాలి? అనే భ‌యం కూడా ఉంది. దీంతో.. ఏం చేయాలో అర్థంకాక త‌ల ప‌ట్టుకున్నార‌ట బాబు.

అటు కేసీఆర్ కు ఇబ్బంది లేదు. ఇటు జ‌గ‌న్ కు కూడా స‌మ‌స్య లేదు. తెలంగాణ‌లో పార్టీని వ‌దిలేసుకొని ఏపీకే ప‌రిమితం అయ్యారు. తెలంగాణ‌లో పార్టీ పెడ‌తానంటూ వ‌చ్చిన ష‌ర్మిల కూడా ఆ రాష్ట్రానికి మ‌ద్ద‌తుగా స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. ఏపీ బీజేపీ నేత‌లు కూడా కేసీఆర్ ను డైరెక్ట్ గా తిట్టేస్తున్నారు. మొత్తంగా ఈ పంచాయ‌తీలో ఏ స్టాండ్ తీసుకోవాలో అర్థం కాక‌.. అవ‌స్థ‌లు ప‌డుతున్న‌ది మాత్రం చంద్ర‌బాబే. మ‌రి, ఈ మౌనాన్ని ఎలా బ్రేక్ చేస్తారు? దాని పర్యవసానం ఎలా ఉంటుంది? అన్న‌ది చూడాలి.