IT Notice On Chandrababu: అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుంచి 118 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని చంద్రబాబుపై అభియోగం మోపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. అయితే ఇందులో తాజాగా లోకేష్ ప్రస్తావన బయటకు రావడం గమనార్హం. చంద్రబాబుకు ఇచ్చిన 46 పేజీల సుదీర్ఘ నోటీసుల్లో లోకేష్ పేరును కూడా ఐటీ ప్రస్తావించింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
లోకేష్ కు అత్యంత సన్నిహితుల నుంచి నగదు చంద్రబాబుకు చేరిందన్నది ఐటీ అభియోగం. 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు చేసింది. ఆ సమయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లోకేష్ అత్యంత సన్నిహితుడు, టిడిపి కార్యదర్శిగా ఉన్న కిలారు రాజేష్, విశాఖకు చెందిన ఆర్విఆర్ నిర్మాణరంగ సంస్థకు చెందిన రఘురేలా, ఆయన సన్నిహితులు ద్వారా భారీ మొత్తాలు చేరినట్లు.. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటంటూ చంద్రబాబును ఐటీ ప్రశ్నిస్తూ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.
ఎన్నికల అనంతరం సైతం డబ్బు లావాదేవీలు కొనసాగించినట్లు ఐటీ శాఖ గుర్తించినట్లు తెలుస్తోంది. 2019 మే 22న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ కు.. ఇన్ఫ్రా కంపెనీకి చెందిన మనోజ్ వాసుదేవ్ పార్థసాని మధ్య వాట్సాప్ సంభాషణలు సైతం అయితే గుర్తించినట్లు సమాచారం. ఆరోజు చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ డబ్బులు పంపిణీ గురించి అడగ్గా.. కిలారి రాజేష్ కు 4.5 కోట్లను పార్టీ ఆఫీసులో అందించినట్లు.. అంకిత్ బలదూత, రఘు రేలా, శ్రీకాంత్ ల మిగతా మొత్తం అందించినట్లు పార్థసాని చెప్పుకొచ్చినట్లు.. వాటికి సంబంధించిన సంభాషణలు ఐటీ కి చిక్కినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇలా నగదు లావాదేవీలు జరిపిన వారంతా లోకేష్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డారు. అందుకే ఐటీ లోకేష్ పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అటు లోకేష్ చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తున్నట్లు పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఈ కేసు నుంచి తండ్రీ కుమారుడు తప్పించుకోలేరని వైసిపి పక్షాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.