Murders: అయినవాళ్లే హంతకులు.. రాష్ట్రంలో నివ్వెర పరుస్తున్న హత్యలు

ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. ప్రియుడితో పారిపోయి వివాహం చేసుకోవాలని భావించిన చందన.. తన అక్క దీప్తిని చంపేసింది. ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకొని ప్రియుడితో ఉడాయించింది.

Written By: Bhaskar, Updated On : September 5, 2023 5:16 pm

Murders

Follow us on

Murders: మనతోనే ఉంటారు. చక్కగా మాట్లాడుతుంటారు. ఆప్తులుగా చలామణి అవుతుంటారు. కానీ వారే ప్రాణాలు తీస్తున్నారు. కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు, భూ తగాదాలు.. కారణాలు ఏవైనప్పటికీ.. కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఈ తరహా హత్యలు, హత్యాయత్నాలు రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నాయి.

గత ఏడాది 762

గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 762 హత్యలు జరిగాయి. వీటిలో ఆస్తి, భూ, కుటుంబ తగాదాలు, వివాహేతర సంబంధాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. వివిధ కారణాలవల్ల తెలిసినవారు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య తలెత్తిన వివాదాలు హత్యలకు దారితీస్తున్నాయి. ఏడాది మొదటి అర్థ వార్షికంలో నమోదైన నేరాలను చూస్తే.. ఏడాది కంటే మించిపోయినట్టు కనిపిస్తోంది. అందులోనూ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఘోరాలు ఒకదానికి మించి మరొకటిగా ఉంటున్నాయి.

ఒక్కో చోట ఒక్కో విధంగా..

భార్యపై కోపంతో పసిపిల్ల గొంతు కోసిన కసాయి ఒకరైతే.. అక్రమ సంబంధానికి కన్న కూతురు అడ్డంగా ఉందని ఊపిరాడకుండా చేసి హత్య చేసిన కిరాతక తల్లి మరొకరు.. చెప్పిన మాట వినలేదని భార్య గొంతు కోసిన వాడు ఒకడైతే.. తాగి వచ్చి కొడుతున్నాడని కోపంతో భర్తను చిత్రహింసలు పెట్టి కడ తేర్చిన ఇల్లాలు మరొకరు.. ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని యువకుడి గొంతు కోసిన యువతి ఒకరయితే.. ప్రేమను నిరాకరించిందని కసితో యువతితోపాటు ఆమెతో పాటు సోదరుడిపై కత్తి దూసినవాడు మరొకడు..

దారుణాలకు వెనుకాడటం లేదు

ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. ప్రియుడితో పారిపోయి వివాహం చేసుకోవాలని భావించిన చందన.. తన అక్క దీప్తిని చంపేసింది. ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకొని ప్రియుడితో ఉడాయించింది. కోరుట్ల జరిగిన ఈ సంఘటన గత వారం రాష్ట్రంలో సంచలనాన్ని రేకెత్తించింది. ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది చేతిలో సంఘవి అనే యువతి తీవ్రంగా గాయపడగా.. సోదరుడు కనుమూశాడు. తనతో పెళ్లికి అంగీకరించలేదనే కారణంతోనే శివ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇక ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో సంగీత అనే యువతిని పెళ్లి పేరుతో స్థానికంగా ఉండే శ్రీనివాస్ వేధించాడు. శ్రీనివాస్ వేధింపులు ఎక్కువ కావడంతో సంగీత గత మార్చి నెలలో కత్తితో పొడిచి హత్య చేసింది. భూ వివాదం నేపథ్యంలో రాజేంద్రనగర్ లోని జిమ్ కోచ్ రాహుల్ సింగ్ బంధువులు హత్య చేయించారు. టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన సుఫారీ గ్యాంగ్ తో ఒప్పందం కుర్చుకొని పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారు..

విచక్షణ కోల్పోయి

భర్త ఉద్యోగం పోవడంతో భార్య, ఎనిమిది సంవత్సరాల కూతుర్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో కసి పెంచుకున్న భర్త స్కూల్లో నుంచి కూతురిని బయటకు తీసుకొచ్చి కారులో గొంతు కోసి హత్య చేశాడు.. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇక ఓ ఆటో డ్రైవర్ భార్య భర్తతో మనస్పర్ధలు రావడంతో అతనికి దూరంగా ఉంటున్నది. స్థానికంగా ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి అడ్డుగా ఉందని తన కూతుర్ని హత్య చేసింది.. అయితే ఇన్ని నేరాలు జరగడానికి ప్రధాన కారణం మనుషుల్లో ఉన్న విపరీతమైన ప్రవర్తన. దిశ హత్య జరిగిన తర్వాత చాలామంది నేరస్తుల్లో ఇలాంటి ప్రవర్తన ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అలాంటి వారిపై ఓ నిఘా పెట్టాలని అప్పటి డిజిపి మహేందర్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దానికి తగ్గట్టుగానే పోలీసులు కూడా కొంతవరకు కసరత్తు చేశారు. మహేందర్ రెడ్డి మారిన తర్వాత పోలీస్ వ్యవస్థలో కూడా మార్పులు వచ్చాయి. సంచలనం సృష్టించిన సంఘవి కేసులోనూ.. శివ ప్రవర్తన విపరీతంగా ఉందని పోలీసుల విచారణలో వెలుగులోకి రావడం విశేషం.