Lok Sabha Elections Results 2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం కానుంది. నరాల తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. అయితే అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో ఫలితాలు ఆసక్తికరంగా ఉండడంతో అందరి దృష్టి రాష్ట్రంపై పడింది. మరోవైపు కవ్వింపు చర్యలు ఉంటాయని, విధ్వంసాలు జరుగుతాయని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీస్ శాఖ అలెర్ట్ అయింది. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినా, అభ్యంతర పోస్టులు పెట్టినా చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా పై ఎలక్షన్ కమిషన్ కొన్ని రకాల ఆంక్షలు విధించింది. ఇప్పుడు కౌంటింగ్ దృష్ట్యా మరింత కఠిన తరం చేసింది పోలీస్ శాఖ. అభ్యర్థుల గెలుపోటములపై అభ్యంతరకర పోస్టులు సోషల్ మీడియాలో కనిపించడం ఇటీవల పరిపాటిగా మారింది. కౌంటింగ్ తర్వాత మీ లెక్క తెలుస్తామంటూ కొందరు ప్రత్యర్థి పార్టీలకు హెచ్చరికలు పంపుతున్నారు. దీంతో ఇది విధ్వంసాలకు దారి తీసే అవకాశం ఉందని పోలీస్ శాఖ అనుమానిస్తోంది. అందుకే సోషల్ మీడియా పై ఫోకస్ పెట్టింది. ఇందుకుగాను ప్రత్యేక బృందాలను సైతం నియమించింది. రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు, ఫోటోలు వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో స్టేటస్లు, పోస్టులు పెట్టడం నిషేధమని తెలిపింది.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కామెంట్స్, వ్యక్తిగత దూషణలు చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు పోస్టులు పెడుతున్నారు? ఎవరి అండతో ఈ పని చేస్తున్నారో సమగ్రంగా విచారించనున్నారు. అవసరమైతే ఐ టి యాక్ట్ కింద కేసులు నమోదు.. అంతకుమించితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ విషయంలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లు అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే కొన్ని రకాల సూచనలు చేశారు ఏపీ పోలీసులు.