Lok Sabha Election 2024
Lok Sabha Election 2024: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నిర్వహిస్తున్న పోలింగ్ లో.. రెండవ దశ విజయవంతంగా ముగిసింది. చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అత్యధికంగా పోలింగ్ నమోదు కాగా.. అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో తక్కువ స్థాయిలో పోలింగ్ నమోదయింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కొన్నిచోట్ల రాత్రి పొద్దుపోయే దాకా కూడా ఓటు వేసేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. పోలింగ్ బాగా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం ట్వీట్ కూడా చేశారు.
రెండవ దశ పోలింగ్లో త్రిపుర రాష్ట్రంలో అత్యధికంగా 77.93% పోలింగ్ నమోదయింది. మణిపూర్ ప్రాంతంలో 76.46, ఛత్తీస్ గడ్ లో 72.13, అస్సాం 70.67, ఉత్తర ప్రదేశ్ లో 52.91%. మహారాష్ట్ర 53.71, బీహార్ 53.6, మధ్యప్రదేశ్ 55.16, రాజస్థాన్ 59.35, కేరళలో 64.8, కర్ణాటకలో 64.4, జమ్మూ కాశ్మీర్లో 67.22 పోలింగ్ శాతం నమోదయింది. రెండవ దశలో భాగంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్ 13, మహారాష్ట్ర ఎనిమిది, ఉత్తరప్రదేశ్ ఎనిమిది, మధ్యప్రదేశ్ 6, అస్సాం ఐదు, బీహార్ 5, ఛత్తీస్ గడ్ మూడు, వెస్ట్ బెంగాల్ మూడు, మణిపూర్ ఒకటి, త్రిపుర ఒకటి, జమ్ము కాశ్మీర్లో ఒక పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
ఉత్తర ప్రదేశ్ లోని మధుర, రాజస్థాన్లోని బన్సవారా, మహారాష్ట్రలోని పర్బాని నియోజకవర్గాల పరిధిలో కొన్ని గ్రామాల ఓటర్లు ఎన్నికలు బహిష్కరించారు. మా గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తేనే ఓటు వేస్తామని స్పష్టం చేశారు. దీంతో అధికారులు వారి వద్దకు చేరుకొని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు.
రాజీవ్ చంద్రశేఖర్, మురళీధరన్, వీరేంద్ర కుమార్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, నటి హేమామాలిని, తేజస్వి సూర్య, అరుణ్ గోవిల్, శశి థరూర్, రాహుల్ గాంధీ వంటివారు రెండవ దశలో జరిగిన పోలింగ్లో బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, మతం పేరుతో ప్రజల్లో భావోద్వేగాలు రేకెత్తించిన బెంగళూరు దక్షిణ పార్లమెంట్ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు తేజస్వి సూర్య పై కేసు నమోదయింది.. త్రిపుర రాష్ట్రంలో స్థిరపడిన బ్రూ శరణార్థులు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిజోరం రాష్ట్రానికి రాకుండా వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ఇది రెండవసారి. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో నక్సలైట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న కంకేర్, రాజ్ నంద్ గావ్, మహా సముంద్ నియోజకవర్గాలలో 72% ఓటింగ్ నమోదు కావడం విశేషం. గర్యబంద్ జిల్లాలో విధుల్లో ఉన్న ఓ పోలీస్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు. ఇక తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 102 స్థానాలకు ఏప్రిల్ 19న ఎన్నికల నిర్వహించారు. 34.8 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తయింది.