
ఉత్తరప్రదేశ్ లోని దారుణం జరిగింది. సమాజ్ వాదీ పార్టీ నేతను, అతడి కుమారుడిని అందరు చూస్తుండగానే.. దుండగులు తుపాకులతో కాల్చిచంపారు. కాల్పుల దృశ్యాలను అక్కడి స్థానికుల్లో ఒకరు యాదృచ్చితంగా రికార్డ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ సంబల్ జిల్లాలో శామ్సోయి గ్రామంలో ఉపాధి హామీ పనులలో భాగంగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఐతే తమ పొలంలో గంతులు తవ్వుతున్నారనే సమాచారంతో సమాజ్ వాదీ పార్టీ నేత చోటె లాల్ దివాకర్, ఆయన కుమారుడు సునీల్ అక్కడకు చేరుకున్నారు. ఈ విషయమై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో వాగ్వాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు తుపాకులు చేతిలో పట్టుకొని సమాజ్ వాదీ పార్టీ నేతను, ఆయన కుమారుడిని బెదిరించారు. అయినా భయపడకుండా తండ్రీకొడుకులు వారిని నిలదీశారు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ఇద్దరు దుండగులు తుపాకులు ఎక్కుపెట్టి కాల్పులు జరిపారు. ఒకరు చోటే లాల్ దివాకర్ ని కాల్చగా.. మరో వ్యక్తి అతడి కుమారుడు సునీల్ ను కాల్చాడు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.