ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారని న్యాయమూర్తులపై ఇష్టం వచ్చినట్లు దూషణలకు పాల్పడితే అంతే సంగతి. తాజాగా వైసీపీ కార్యకర్త లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యవహారంలో జరిగిన విషయం చూస్తే ఎవరికైనా అర్థమైపోతోంది. ఆయనను గల్ఫ్ నుంచి రప్పించి సీబీఐ అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం సంచలనం అవుతోంది. వైఎస్సార్ పార్టీలో అలజడి రేపుతోంది. మొత్తం 22 మంది వైసీపీ కార్యకర్తలను నేడో రేపో సీబీఐ అరెస్టు చేస్తుందని ప్రచారం సాగుతోంది.
లింగారెడ్డి పాస్ పోర్ట్ రద్దు చేసిన తరువాత ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టాడు. తన జీవితం పాడై పోయినా జగనన్న ఆదుకుంటాడన్న నమ్మకం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆ ఫేస్ బుక్ కనిపించకుండా పోయింది. దీంతో గల్ఫ్ లో ఉద్యోగం పోగొట్టుకుని ఇండియాకు వచ్చి సీబీఐ చేతుల్లో చిక్కాడు. ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ ఎలాంటి సాయం అందకపోవడంతో వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి కూడా ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. వైసీపీ కార్యకర్తలు ఎవరూ కూడా ఆవేశ పడి లేనిపోని పోస్టులు పెట్టి చిక్కుల్లో పడవద్దని సూచించారు.
సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న వారిని వైసీపీ ఆదుకోదని చెప్పారు. కేసుల బారిన పడిన వారిని రక్షించడానికి ప్రయత్నించే అవకాశాలు లేవని తేల్చేశారు. న్యాయవ్యవస్థపై నిందలు వేసే వారిని హైకోర్టు అంత తేలిగ్గా తీసుకోదని సూచించారు. సీఐడీ సరిగా చర్యలు తీసుకోకపోవడంతోనే కేసులు సీబీఐ చేతిలోకి వెళ్లాయని వెల్లడించారు. విదేశాల్లో ఉన్న వారిని సైతం ఇండియాకు రప్పించి మరీ అరెస్టులు చేయడంతో జోరుగా చర్చ సాగుతోంది.
న్యాయవ్యవస్థపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని సూచిస్తున్నారు. తమను ఎవరు ఏమి చేయరని అనుకోవద్దని హెచ్చరిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు మార్గదర్శకులు చెప్పిన మాటలు విని పోస్టులు పెట్టి జీవితాలను పణంగా పెట్టవద్దని చెప్పారు. న్యాయవ్యవస్థను కించపరిస్తే ప్రభుత్వం కూడా ఊరుకోదని పేర్కొన్నారు.