Daggubati Purandeswari: పురందేశ్వరి కి లైన్ క్లియర్.. రాజమండ్రికి జీవీఎల్ షిఫ్ట్!

ప్రధానంగా విశాఖపట్నం బిజెపి నేతలు దృష్టి పెట్టినట్లు సమాచారం. 2014లో టిడిపి తో పొత్తులో భాగంగా బిజెపి ఈ స్థానాన్ని దక్కించుకుంది. ఎంపీగా హరిబాబు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

Written By: Dharma, Updated On : February 10, 2024 1:24 pm

Daggubati Purandeswari

Follow us on

Daggubati Purandeswari: భారతీయ జనతా పార్టీ ఏపీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే వీలైనన్ని ఎక్కువ ఎంపి స్థానాలు గెలుచుకోవాలని చూస్తోంది. గతంలో బిజెపి ప్రాతినిధ్యం వహించిన స్థానాలతో పాటు మరికొన్నింటిని దక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది. పొత్తులో భాగంగా బిజెపి 8 నుంచి 10 ఎంపి స్థానాలను అడుగుతోందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఇలా ఢిల్లీ వెళ్లి పొత్తుల చర్చలు జరిపారో లేదో.. ఏపీలో బిజెపి నాయకులు అలెర్ట్ అయ్యారు. సురక్షిత స్థానాలను ఎంచుకునే పనిలో పడ్డారు.

ప్రధానంగా విశాఖపట్నం బిజెపి నేతలు దృష్టి పెట్టినట్లు సమాచారం. 2014లో టిడిపి తో పొత్తులో భాగంగా బిజెపి ఈ స్థానాన్ని దక్కించుకుంది. ఎంపీగా హరిబాబు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు కానీ పొత్తు కుదిరితే.. ఈ స్థానాన్ని బిజెపి సొంతం చేసుకునే అవకాశం ఉంది. దీంతో విశాఖ పార్లమెంట్ స్థానంపై బిజెపి కీలక నేతలు పురందేశ్వరి, జివిఎల్ నరసింహారావు ఫోకస్ పెట్టారు. అయితే పురందేశ్వరి రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు కావడం, ఇటీవల తెలుగుదేశం విషయంలో సాఫ్ట్ కార్నర్ లో ఉండడం, గతంలో ఇదే పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించి ఉండడం, తదితర కారణాలతో ఆమెకు టికెట్ ఖరారు అవుతుందని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆమె విశాఖపట్నం స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం.

అయితే గత ఎన్నికల్లో బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోడల్లుడు, మాజీ ఎంపీ ఎంవివిఎస్ సత్యనారాయణ మనుమడు భరత్ పోటీ చేశారు. నాలుగువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ స్థానంలో టిడిపి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు పురందేశ్వరి ఆ సీటు కోరుతుండడంతో.. భరత్ నిర్ణయం ఏంటన్నది తెలియడం లేదు. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగే ఛాన్స్ లేదు. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మరోసారి పోటీ చేయనున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన భరత్ ను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే సామాజికపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భరత్ ను ఎక్కడ సర్దుబాటు చేస్తారో చూడాలి.

మరోవైపు బిజెపి నుంచి జివిఎల్ నరసింహారావు బలమైన ఆశావాహుడుగా ఉన్నారు. ఆయన సైతం విశాఖపట్నం చాలా రోజులుగా దృష్టి పెట్టారు. స్థానికంగా ఇల్లు తీసుకొని మరీ కార్యకలాపాలు ప్రారంభించారు. మొన్నటికి మొన్న సంక్రాంతి సంబరాల పేరిట హడావిడి చేశారు. అయితే ఈయన విషయంలో చంద్రబాబు అనుకున్నంత ఆశాజనకంగా లేరు. బిజెపితో టిడిపి పొత్తు విషయంలో అడ్డుకున్న వారిలో జివిఎల్ ఒకరు. అయితే జీవీఎల్ ను ఇప్పుడు రాజమండ్రి ఎంపీ స్థానానికి పంపిస్తారని టాక్ నడుస్తోంది. ఆ పార్లమెంట్ స్థానం పరిధిలో బ్రాహ్మణ సామాజిక వర్గం అధికం. అందుకే జీవీఎల్ ను అక్కడకు పంపించి.. పురందేశ్వరికి విశాఖకు లైన్ క్లియర్ చేస్తారని తెలుస్తోంది. బిజెపితో పొత్తుల వ్యవహారం తర్వాత పురందేశ్వరి విశాఖలో యాక్టివ్ అవుతారని సమాచారం.