ఉత్తరాంధ్రలో టీడీపీకి పెద్ద దిక్కు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని తెలిసింది. ఈ మేరకు టీడీపీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.
విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గంటా ఉన్నారు. ఆయన శనివారం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అదే రోజు వైసీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈనెల 3న ముందుగా గంటా కొడుకు వైసీపీలో చేరబోతున్నట్టు సమాచారం. ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు శనివారం చేరబోతున్నట్టు తెలుస్తోంది.
గంటా శ్రీనివాసరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీచేసి విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ పార్టీ మాత్రం ఓడిపోయింది. గడిచిన నాలుగైదు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ చేరి మంత్రిగా అధికారం అనుభవిస్తున్న టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ రావు అంచనా ఈసారి తప్పింది. దీంతో ఈసారి అధికారానికి దూరంగా ఉన్నారు. కానీ దాన్ని భరించలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది.
గంటా టీడీపీలో ఇమడలేక.. వైసీపీలో చేరలేక సతమతమవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు గంటా గారి ట్రాక్ రికార్డ్ చూసి ఏకంగా జనసేన నో చెప్పిందని.. బీజేపీ తలుపులు మూసిందని ప్రచారం సాగుతోంది.. ఇక అధికార పార్టీ కావడంతో వైసీపీలో చేరాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
ఇప్పటికే చేరాల్సి ఉన్న గంటాను మంత్రి అవంతి శ్రీనివాసరావు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. చివరకు ఎట్టకేలకు అందరినీ ఒప్పించి గంటా వైసీపీలో చేరడానికి ముహూర్తం ఖాయమైందనే ప్రచారం సాగుతోంది.