
చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ అన్ని దేశాలకంటే ఎక్కువగా దెబ్బతీసింది అమెరికానే. నాడు ట్రంప్ ఉన్న సమయంలో ఆయన పాలన వైఫల్యంతో లక్షల కేసులు.. వేల మరణాలు అమెరికాలో సంభవించాయి. ట్రంప్ కరోనా విషయంలో ముందు చూపులేక.. వ్యవహరించిన తీరు కారణంగా అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంది. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ట్రంప్ ఘోరంగా ఓడిపోయాడు. ప్రజారోగ్యాన్ని పట్టించుకోని ట్రంప్ ను ప్రజలు గద్దెదించారు.
అయితే ప్రపంచాన్ని ఆవహించిన అతి పెద్ద సంక్షోభాన్ని కొత్త అధ్యక్షుడు జోబైడెన్ గద్దెనెక్కగానే పరిష్కరించారు. పకడ్బందీ ప్రణాళికలతో దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఇప్పించారు. వ్యాక్సిన్ ఎగమతులు, ముడిపదార్థాలను బయట దేశాలకు పోకుండా నిషేధించారు. మందులను దేశంలోనే వినియోగించాలని ఆర్డర్ వేశారు. అలా కొత్త జోబైడెన్ సర్కార్ ఇప్పుడు దేశమంతా వ్యాక్సినేషన్ ను దిగ్విజయంగా నడిపిస్తోంది.
దీంతో ఇప్పుడు ప్రజలు ఊపిరి పీల్చుకునే గొప్ప అవకాశాన్ని అమెరికా ప్రభుత్వం ఇచ్చింది. అమెరికాలో వ్యాక్సినేషన్ పూర్తయిన వాళ్లంతా ఇక ఆదేశంలో మాస్కులు పెట్టుకోకుండానే బయట తిరగొచ్చు అని ఆదేశాలు జారీ చేసింది. అమెరికా సర్కార్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
వ్యాక్సినేషన్ పూర్తయిన వారితోపాటు..పాక్షికంగా జరిగిన వారు కూడా ఇకపై బయట మాస్కులు లేకుండా తిరగొచ్చు అని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఒంటరిగా లేదా కుటుంబ సభ్యులతో కలిసి నడకకు, వాహనాలపై షికారుకు వెళ్లొచ్చు అని పేర్కొంది.
ఇక పూర్తి వ్యాక్సినేషన్ జరిగిన ప్రజలు సమూహంలోకి కూడా వెళ్లొచ్చు అని అమెరికా ప్రభుత్వం ప్రజలకు భరోసానిచ్చింది. వ్యాక్సిన్లు వేసుకోని వారు మాత్రం తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 50శాతానికి మించి వ్యాక్సినేషన్ చేసిన ఇజ్రాయిల్ ఇప్పటికే ఆ దేశంలో మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించిన తొలి దేశమైంది. ఇప్పుడు అమెరికా కూడా అలాంటి ఆదేశాలు ఇవ్వడంతో అక్కడి ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కింది.