
పార్టీ అధినేతగా ఉన్నప్పుడు అంతర్గత పనులన్నీ చక్కబెట్టే అవకాశం ఉంటుంది. కానీ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా పాలనే ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. ఉండాలి కూడా. కానీ.. సీఎం పదవి అంటే సాధారణమైన విషయం కాదు. విపక్షాల నుంచి ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ.. ప్రజల సమస్యలను తీరుస్తూ.. వారిని సంతృప్తి పరుస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది.
కత్తిమీద సాములాంటి ఈ బాధ్యతను నిర్వర్తిస్తూ.. పార్టీ పనులు అన్నింటినీ సమన్వయం చేసుకోవాలంటే ఎవరికైనా కుదరదు. ఏపీ సీఎం జగన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే.. పార్టీ బాధ్యతలను అనధికారికంగా మరొకరికి అప్పగించారనే ప్రచారం సాగుతోంది.
గతంలో.. రాష్ట్రంలో వైసీపీని ముందుకు నడిపించాల్సిన బాధ్యతను ప్రాంతాల వారీగా నేతలకు జగన్ కట్టబెట్టాడని చెబుతుంటారు. అందులో.. గోదావరి జిల్లాల బాధ్యతను వైవీ సుబ్బారికి, ఉత్తరాంధ్ర పగ్గాలు విజయసాయిరెడ్డికి అప్పగించాడని అంటారు. అయితే.. సుబ్బారెడ్డి ఆయా జిల్లాలపై పెద్దగా దృష్టి పెట్టింది లేదనే అభిప్రాయమే ఉంది. విజయసాయిరెడ్డి గతంలో దూకుడుగా ముందుకు సాగినప్పటికీ.. ఇప్పుడు ఆ వేగం లోపించినట్టుగా కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్ షాడో రంగంలోకి దిగారనే ప్రచారం సాగుతోంది. ఆయనే.. సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు వైసీపీలో ఆయన హవా నడుస్తోందని అంటున్నారు. సాక్షి దినపత్రిక ఈడీగా ఆయన పనిచేశారు. అంతేకాదు.. వైఎస్ భారతికి దగ్గరి బంధువు కూడా అంటారు. ఇలా.. అన్ని విధాలుగా ఆయన జగన్ కు దగ్గరి వ్యక్తిలా మారిపోయారని చెబుతున్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ బాధ్యతలను ఆయనే చూస్తున్నారని చెబుతున్నారు. మొత్తం 13 జిల్లాలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారని సమాచారం. బయటకు నేతగా పెద్దగా ప్రొజెక్ట్ కాకపోయినప్పటికీ.. ట్రబుల్ షూటర్ గా మంచి మార్కలు సంపాదించారని, అందుకే.. జగన్ పార్టీ బాధ్యతలను సజ్జలకు అప్పగించారని అంటున్నారు. పార్టీలో ఆయనకు తెలియకుండా ఏదీ జరగట్లేదని అంటున్నారు. పార్టీ నిర్ణయాలను మీడియాకు వెల్లడించేది కూడా ఆయనే అని అంటున్నారు. మొత్తంగా.. సీఎం జగన్ షాడోగా రామకృష్ణారెడ్డి మారిపోయారని చెబుతున్నారు. దీంతో.. అందరూ ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారట.