Gopalkrishna Gandhi: రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో అటు అధికార పార్టీ, ఇటు విపక్షాలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అధికార ఎన్డీఏ ప్రయత్నిస్తుండగా.. విపక్షాలన్నీ ఐక్య అభ్యర్థిని నిలిపేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అయితే విపక్ష కూటమి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ను తెరపైకి వచ్చినా ఆయన ఉన్నపలంగా తాను పోటీకి దూరంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో రకరకాల పేర్లు కొత్తగా తెరపైకి వస్తున్నాయి. గాంధీజీ-సి.రాజగోపాలాచారిల మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని బరిలోకి దించాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు ఆయనతో ఫోన్లో చర్చించాయి. తనకు కాస్త సమయమివ్వాలని ఆయన కోరారని.. బుధవారంలోగా నిర్ణయం చెబుతానని అన్నారని తెలిసింది. ఆయన స్పందన సానుకూలంగా ఉందని ఆయనతో మాట్లాడిన నేతలుతెలిపారు. శ్రీలంకలో భారత రాయబారిగా కూడా పనిచేసిన ఆయన.. 2017లో ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో వెంకయ్యనాయుడిపై పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూడా ఆయన ప్రతిపక్షాల ఏకగీవ్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి ఆయన అంగీకరిస్తే అన్ని విపక్షాలూ ఆయన్నే ఉమ్మడి అభ్యర్థిగా నిలుపుతాయని భావిస్తున్నారు.

ఆయన కాదంటే మరికొన్ని పేర్లను కూడా ప్రతిపక్షాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా.. పవార్ మంగళవారం ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు-పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, ఎన్‌సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, పీసీ చాకోలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. జూలై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి ఆయన్ను ఒప్పించేందుకు వారు ప్రయత్నించారు.
Also Read: Agnipath Scheme: భారత్ అమ్ముల పొదిలోకి అగ్నిపథ్.. తొలి బ్యాచ్ కింద 45 వేల మంది నియామకం
కానీ ఆయన నిరాకరించినట్లు ఏచూరి ఆ తర్వాత విలేకరులకు తెలిపారు. ఓడిపోయే యుద్ధం చేయాలని తమ నేత అనుకోవడం లేదని ఎన్‌సీపీ సీనియర్ నేత నేత, మంత్రి ఛగన్ భుజ్‌బల్ స్పష్టం చేశారు. ‘పవార్ భారత రాష్ట్రపతి అయితే ప్రతి మరాఠీ హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. కానీ సరిపడా సంఖ్యాబలం ఉందా అన్నదే ప్రశ్న. పైగా రాష్ట్రపతో, గవర్నరో అయి రాష్ట్రపతి భవన్‌కో, రాజ్‌భవన్‌కో పరిమితం కావడం పవార్‌కు ఇష్టం లేదు’ అన్నారు. అయితే విజయానికి సరిపడా సంఖ్యాబలం ప్రతిపక్షాలకు ఉంటే పవార్ తన అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

ఇంకోవైపు.. రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిపై చర్చించడానికి మమతా బెనర్జీ ఏర్పాటుచేసిన విపక్షాల సమావేశం బుధవారం జరగనుంది. ఇందుకోసం ఢిల్లీ చేరుకున్న ఆమె పవార్‌తో భేటీ అయ్యారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగాలని కోరారు. ఆయన తోసిపుచ్చారు. అయినా ఆమె బుధవారం నాటి సమావేశంలో ఈ డిమాండ్ పెట్టనున్నట్లు తెలిసింది. కాగా.. మమత ఏకపక్షంగా విపక్షాల భేటీ ఏర్పాటు చేశారని, దీనికి హాజరు కాకూడదని తొలుత నిర్ణయించిన సీపీఎం.. ఇప్పుడు వెళ్లాలని నిర్ణయించింది. సీపీఐ కూడా హాజరు కానుంది. అయితే మమత తీరుకు నిరసనగా తమ అగ్ర నాయకత్వం వెళ్లదని.. తమ ఎంపీలను మాత్రమే పంపుతామని ఏచూరి, రాజా విలేకరులకు తెలిపారు. సీపీఎం రాజ్యసభాపక్ష నేత ఎలమారం కరీం హాజరు కానున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించేందుకు మమత ప్రయత్నించడంపై కాంగ్రెస్ గుర్రుగా ఉన్నా.. ఈ సమావేశానికి వెళ్లాలని నిర్ణయించింది. పార్టీ తరఫున సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేశ్, ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా హాజరు కానున్నారు.
నేటి నుంచే నామినేషన్లు
రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం మొదలుకానుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాజ్యసభ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. రాజ్యసభ సచివాలయంటేబుల్ ఆఫీసు అధికారులంతా దీనిలో ఉన్నారు. జూలై 18న జరిగే ఈ ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ రిటర్నింగ్ అధికారిగా నియమితులయ్యారు. సభ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ముకుల్ పాండే, జాయింట్ సెక్రటరీ సురేంద్రకుమార్ త్రిపాఠీ సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉంటారు. నామినేషన్ పత్రాలు పార్లమెంటు భవనంలో మాత్రమే లభ్యమవుతాయి. వాటి కోసం వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రత్యేక సెల్ చూస్తుంది.
Also Read:India First-Ever Private Train: దేశంలో తొలి ప్రైవేట్ రైలు వచ్చేసింది.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే?