America Vs India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత్‌కు 50% సుంకం విధించింది. తద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచుతోంది. అయితే భారత్ కూడా దీనికి బెరదడం లేదు. చమురు విషయంలో వెనక్కి తగ్గేదే లే అన్నట్లు వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా భారత్ గతంలోనూ అమెరికా ఒత్తిడులను ఎదుర్కొన్న చరిత్రను గుర్తు చేసుకోవడం అవసరం. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయీ వంటి నాయకులు అమెరికా ఒత్తిడులను ధీటుగా ఎదుర్కొని దేశ స్వాభిమానాన్ని కాపాడారు.
Also Read: మూడు వారాల్లో రిటైర్మెంట్.. ఆ అధికారి కక్కుర్తి ఎంత అంటే?
1965 శాస్త్రి ధైర్యం..
1965లో భారత్–పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత్ తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంది. అమెరికా గోధుమల సరఫరా ఆపివేస్తామని బెదిరించి, యుద్ధాన్ని నిలిపివేయమని ఒత్తిడి చేసింది. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఈ బెదిరింపులకు లొంగక, ‘జై జవాన్ జై కిసాన్’ నినాదంతో దేశ ప్రజలను ఐక్యం చేశారు. ఒక పూట ఉపవాసం చేయాలని పిలుపునిచ్చి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ఈ సంఘటన భారత్ యొక్క స్వావలంబన స్ఫూర్తిని ప్రపంచానికి చాటింది.
1971లో ఇందిరా గాంధీ ధీరత్వం..
1971లో భారత్–పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చి, నావికా దళాన్ని భారత సముద్ర సరిహద్దులకు పంపి ఒత్తిడి చేసింది. అయితే, ఇందిరా గాంధీ రష్యా మద్దతుతో ఈ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. భారత సైన్యం విజయం సాధించి, బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసింది. ఇందిరా గాంధీ నాయకత్వం అంతర్జాతీయ ఒత్తిడులకు లొంగని భారత్ శక్తిని ప్రదర్శించింది. 1974లో భారత్ తన మొదటి అణు పరీక్ష (పోఖ్రాన్–1) నిర్వహించినప్పుడు, అమెరికా ఆంక్షలు విధించింది. ఆర్థిక సహాయాన్ని నిలిపివేసింది. ఇందిరా గాంధీ ఈ ఒత్తిడులను ధిక్కరించి, స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు. రష్యా వంటి భాగస్వాములతో సహకరించి, అణు కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు. ఈ సంఘటన భారత స్వతంత్ర నిర్ణయాధికారాన్ని బలపరిచింది.
1998 వాజ్‌పేయి సంకల్పం..
1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో భారత్ పోఖ్రాన్–2 అణు పరీక్షలను నిర్వహించింది. అమెరికా ఆయుధ ఎగుమతులపై నిషేధం, ఆర్థిక ఆంక్షలు విధించింది. వాజ్‌పేయి మాత్రం దేశ భద్రత కోసం ఈ పరీక్షలు అవసరమని స్పష్టం చేశారు. చైనా, పాకిస్తాన్‌ల ఆయుధ సామర్థ్యాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షలను ఎదుర్కొన్న భారత్, 1999 నాటికి అమెరికాతో సంబంధాలను మెరుగుపరిచింది, ఫలితంగా 2000లో బిల్ క్లింటన్ భారత్ సందర్శనతో ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి.
చరిత్ర సాక్షిగా, భారత్ అమెరికా ఒత్తిడులను ఎప్పుడూ స్వాభిమానంతో ఎదుర్కొంది. తాజాగా ట్రంప్ విధించిన 50% సుంకాలను భారత్ ‘అన్యాయం, న్యాయవిరుద్ధం’గా ఖండించింది, ఇది దేశ ఇంధన భద్రత కోసం రష్యా నుంచి చమురు దిగుమతులు అవసరమని నొక్కి చెప్పింది. శాస్త్రి, ఇందిరా, వాజ్‌పేయీల ధీరత్వం నుంచి పాఠాలు నేర్చుకుని, భారత్ ఈ సవాల్‌ను కూడా దౌత్యపరంగా, స్వావలంబనతో ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంది.