ACB Raids: ప్రభుత్వ ఉద్యోగులు( Government employees) అంటేనే అవినీతిపరులుగా ముద్రపడిన రోజులు ఇవి. అలాగని అందరూ అవినీతి చేస్తారని భావించలేం కూడా. కానీ ఏపీ చరిత్రలోనే ఓ సంచలనాత్మకమైన అవినీతి అధికారి బాగోతాన్ని బయట పెట్టింది అవినీతి నిరోధక శాఖ. యంత్రాంగంలో పాతుకుపోయిన అవినీతిని మరోసారి బయటపెట్టింది. మరో మూడు వారాల లో పదవీ విరమణ చెయ్యనున్న ఓ గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ ఏసీబీ వలకు చిక్కారు. ఆ శాఖలో పనికి ఐదు కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసి.. ఆ నోట్ల కట్టలు లెక్కపెడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద లంచం కేసుల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఉన్నతాధికారి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేయడం.. దానికోసం పక్కా ప్రణాళికతో చివరకు పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Also Read: ‘మయసభ’ కాదు ఇదీ.. రాజకీయ ప్రతీకార సభ?
* రూ.5 కోట్లు లంచం డిమాండ్
గిరిజన సంక్షేమ శాఖలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు, అబ్బవరపు శ్రీనివాస్( Abba varupu Srinivas ). ఈనెల 30న ఆయన పదవీ విరమణ పొందుతారు. ఈ తరుణంలో ఆయన లంచం తీసుకుంటూ పట్టు పడడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల నిర్మాణం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ కాంట్రాక్టులు తగ్గించుకున్నారు సత్యసాయి కన్స్ట్రక్షన్స్ అధినేత కృష్ణంరాజు. ఆయనకు ప్రభుత్వం నుంచి రూ.35.5 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. అయితే ఈ బిల్లుల విడుదలకు అడ్డుపడ్డారు గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ అబ్బవరపు శ్రీనివాస్. వాటిని క్లియర్ చేయాలంటే ఐదు కోట్లు లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు లంచం డీల్ లో భాగంగా శ్రీనివాస్ కు టోకెన్ అడ్వాన్స్ గా 25 లక్షల రూపాయలు ఇచ్చారు. అక్కడే మాటు వేసిన విశాఖ, విజయవాడ ఏసిబి అధికారులు మెరుపు దాడి చేశారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
* పోగేసుకోవాలని ఆత్రుత
అయితే ఈ కేసులో యంత్రాంగంలో అవినీతి అధికారులు, ఉద్యోగుల టార్గెట్ ఎలా ఉంటుందో స్పష్టమవుతోంది. మరికొద్ది రోజుల్లోనే రిటైర్మెంట్ కాబోతున్న ఓ అధికారి.. ఈ లోపల ఎంత పోగేసుకోవాలో అంత పోగేసుకునేందుకు ఇలా లంచం డిమాండ్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయల్లో డిమాండ్ చేయడం సామాన్య విషయం కాదు. అయితే దొరికితే దొంగ.. దొరకకుంటే దొర అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఈ లెక్కన అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. యంత్రాంగంలో పేరుకుపోయిన అవినీతి కూపం ఏ స్థాయిలో ఉందో స్పష్టమౌతోంది. వారి పిల్లలు.. వారి వారి పిల్లలు బతికేంతగా అవినీతి సంపాదనతో కొందరు అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ పర్వం అలాంటిదే. సరిగ్గా రోజుల వ్యవధిలో ఆయన శేష జీవితంలోకి అడుగుపెడుతున్నారనగా.. సమాజంలో అవినీతి మరక అంటించుకున్నారు. అవినీతి అధికారులకు ఆదర్శంగా నిలిచారు. అవినీతి భయపడేలా అవినీతి చేశారు.
* రాష్ట్ర చరిత్రలోనే పెద్దది..
రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద అవినీతి కేసు బయటపడడం ఇదే తొలిసారి. పది లక్షలకు పైగా లంచం తీసుకునే అధికారులు అరుదుగా ఉండే ఈ రోజుల్లో.. కోట్లలో డిమాండ్ చేయడం చిన్న విషయం కాదు. ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో అవినీతి మూలంగా నాణ్యత దెబ్బతింటోంది. నిబంధనలను పాటించడం లేదు. అయితే ఈ అవినీతి అనేది కూకటి వేళ్ళతో పెకిలించాల్సిన అవసరం ఉంది. లేకుంటే వ్యవస్థలు నీరు గారి పోతాయి. ప్రభుత్వ నిధులు కరిగిపోతాయి. తిలాపాపం తలోపిడికెడు అన్నట్టు.. ఈ అవినీతిలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు భాగం అవుతారు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెచ్చినా.. వ్యవస్థలో మార్పులు రానంతవరకు ఈ అవినీతికి అంతం లేదు.