Sajjala: వైసీపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి నేతలకు మధ్య గ్యాప్ పెరిగినట్లే కన్పిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పార్టీలోని ముఖ్య నేతలతో చాలా క్లోజ్ రిలేషన్ షిప్ మెంటేన్ చేశారు. వారిని తన కుటుంబ సభ్యుల్లా చూసుకునే వారనే టాక్ ఉంది. వీరంతా కలిసి కట్టుగా కృషి చేయడంతోనే వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి పార్టీలోని ముఖ్యనేతలకు మంత్రి పదవులను ఇచ్చారు. మిగిలిన వారికి రాజ్యసభ, ఎమ్మెల్సీ, నామినేషన్ పదవులను కట్టబెట్టి సాధ్యమైనంత వరకు కూడా న్యాయం చేశారు. ఈక్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చుట్టూరా సలహాదారులనే కోటరీ ఏర్పడింది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణ రెడ్డి జగన్ ముఖ్య సలహాదారుడిగా నియామకం అయ్యాక పార్టీ నేతలకు, జగన్ కు మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది.
సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల కాలంలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో మితిమీరి జోక్యం చేసుకుంటారనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. సీఎంవోను కూడా సజ్జల తన గుప్పిట్లో పెట్టుకున్నారనే అసంతృప్తి వైసీపీ ముఖ్య నేతల్లో ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డితో అపాయింట్మెంట్ ఉన్నా ఏ విషయమైనా ముందుగానే సజ్జలతోనే పంచుకోవాల్సిందేనని పార్టీ నేతలు వాపోతున్నారు.
దీంతో పార్టీకి, సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య గ్యాప్ నెలకొంటుందని చెబుతున్నారు. సజ్జల రామకృష్ణ తనకు నచ్చినవారికే జగన్మోహన్ రెడ్డితో అపాయిమ్మెంట్స్ ఇప్పిస్తూ కొందరిని పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని టాక్ విన్పిస్తోంది. ఇటీవల మంత్రి పదవులు రాకపోవడంతో అలకబూనిన ఎమ్మెల్యేలను బుజ్జగించే విషయంలో సజ్జల కొందరిలో విషయంలో ఒకలా, మరికొందరితో ఒకలా వ్యవహరించడం ఇందుకు నిదర్శనమని ఆపార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
మాజీ మంత్రి బాలినేనితో మూడుసార్లు భేటి అయ్యి చర్చించిన సజ్జల రామకృష్ణారెడ్డి సుచరిత రాజీనామా చేస్తే కనీసం ఆమెను ఒక్కసారి కూడా కలువలేదు. పార్టీలో ఎవరినీ బుజ్జగించాలో కూడా ఆయనే డిసైడ్ చేసేస్తున్నారు. ఆయన వ్యవహారం పార్టీలో చిచ్చులేపేలా మారుతోంది. గతంలో ఎన్టీఆర్ హయాంలో లక్ష్మీ పార్వతి కూడా ఇలానే వ్యవహరించారు. తనకు నచ్చిన వారికే మాత్రమే ఎన్టీఆర్ తో అపాయిమ్మెంట్ ఇప్పించేవారు. తద్వారా పార్టీ విషయాల్లో జోక్యం చేసుకునేవారు. ఆ తర్వాతి కాలంలో ఈ వ్యవహారమే పార్టీలో తిరుగబాటుకు కారణమయ్యారు.
ప్రస్తుతం వైసీపీలో సజ్జల వ్యవహరిస్తున్న తీరు సైతం నాడు లక్ష్మీ పార్వతి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తుందని పలువురు వాపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ముందుగా మెల్కోనపోతే మాత్రం గతంలో టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.