AP Politics: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల ఆగడాలు హద్దు మీరుతున్నాయి. దీంతో సొంత పార్టీ నేతలపైనే వారి ప్రతాపం కొనసాగుతోంది. భూకబ్జాలు, వేధింపులతో సతమతమవుతున్నారు. ఫలితంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. దీనికి గతంలో కూడా చాలా సంఘటనలు జరిగిన విషయాలు తెలిసినవే. కానీ ఈ మధ్య కాలంలో వైసీపీ నేతల తీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. సొంత పార్టీ కార్యకర్తలపైనే వారి ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో వారు చేసేది లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. అయినా వారి తీరులో మార్పు కానరావడం లేదు.

తాజాగా కుప్పం నియోజకవర్గంలోని వైసీపీ నేత పార్థసారధి తన చావుకు సొంత పార్టీ నేతలే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఎంతో కష్ట పడినా గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇచ్చారు. తరువాత దాన్ని కూడా లాగేశారు. దీంతో ఆయన ఇక బతుకు వ్యర్థమని భావించి చివరకు తనువు చాలించాడు. చేసిన అప్పులు తీర్చలేక విగతజీవిగా మారాడు.
చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన ఓ నేత కూడా ఇలాగే సెల్ఫీ తీసుకుని అడవిలోకి వెళ్లినా ఎలాగోలా కాపాడారు. దీనికంతటికి కారణం వైసీపీ నేతలే కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతోంది. సొంత పార్టీ నేతలే రాబందుల్లా పీక్కుతినేందుకు సిద్ధపడటం తెలిసిందే. ఇక ఎవరికి చెప్పుకునేదని వాపోతున్నారు.వైసీపీనేతల ఆగడాలు శృతిమించుతున్నాయని తెలుస్తోంది.
వైసీపీ అధికారంలోకి రాకముందు రూ.లక్షలు ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేసినా తగిన గుర్తింపు లేదని వాపోతున్నారు. పైగా సొంత పార్టీ నేతలే తమకు అడ్డంకులు సృష్టిస్తూ భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడటంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు వదులుతున్నారు. కంచే చేను మేస్తే అన్నచందంగా వైసీపీ నేతల చేష్టలుంటున్నాయి. దీంతో ఎవరిని అడిగినా ఇదే సమాధానాలు వస్తున్నాయి. ఎక్కడేం లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్న చందంగా వైసీపీ నేతలు సొంత పార్టీ వారినే టార్గెట్ చేసుకోవడం ఆశ్చర్యకరమే.

ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ బతికి బట్టకడుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీలోనే అసమ్మతి ఉంటే ఇక పార్టీ ఎలా బతికి బట్ట కడుతుందనే వాదనలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి నేతల్లో అసంతృప్తి మరింతగా పెరిగిపోయే వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించే సందర్భాలు కూడా వస్తాయని జోస్యం చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు జగన్ కు మరింత సవాలుగా మారనున్నాయని తెలుస్తోంది.