KCR: తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఏ పార్టీ కండువా కప్పుకుంటారో అంతు చిక్కడం లేదు. మొన్నటిదాకా విమర్శలు చేసుకున్న వారు అన్నదమ్ముల్లాగా కలిసిపోతున్నారు. అన్నదమ్ముల్లా ఉన్నవారు ఒక్కసారిగా శత్రువులవుతున్నారు. ఇది చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకప్పుడంటే రాజకీయాల్లో విలువలు ఉండేవి. ఇప్పుడు ఆ విలువలు భూస్థాపితం అయిపోయాయి కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం, గువ్వల బాల్ రాజ్ ఉదంతం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనుకోని మార్పు చోటుచేసుకుంది. బయటికి ఉప్పు, నిప్పులాగా ఉన్న బీఆర్ ఎస్_ బీజేపీ వ్యవహారంలో తాజాగా ఒక రాజకీయ పార్టీ చేరింది. ఎన్డీఏ కూటమి లో ఉన్న ఆ పార్టీ కేసీఆర్ కు జై కొట్టింది.
మద్దతు పలికింది
తెలంగాణ ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తోంది. సాధారణంగా ఇలాంటి సమయంలో బిజెపికి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు మద్దతు పలకడం సహజం. కానీ ఆ పరిస్థితులకు భిన్నంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న “జనతా దళ్ ఎస్” భారత రాష్ట్ర సమితికి మద్దతు పలికింది. ఆ పార్టీ అధినేత కుమారస్వామి హైదరాబాదులో కాకుండా నేరుగా బెంగళూరులోనే ఒక ప్రకటన చేశారు..” కర్ణాటక రాష్ట్రంలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదు. ఎన్నికల ముందు ఐదు హామీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయలేక పూర్తిగా చతికిల పడింది. తెలంగాణలో కూడా ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోంది.” అని కుమారస్వామి ఆరోపించారు. “తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రైతులకు పదివేల చొప్పున ఇస్తున్నారు. ఇప్పుడు దానిని 15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు తెలియనిది ఏమిటంటే 73,000 కోట్లకు పైగా రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేశారు. గతంలో కర్ణాటకలో ఎకరానికి 4000 మాత్రమే ఇచ్చేవారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాలుగు వేలు కూడా ఇవ్వడం లేదు. కెసిఆర్ ప్రభుత్వం 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్నది కేవలం రెండు గంటల కరెంటు మాత్రమే” అని కుమారస్వామి ధ్వజమెత్తారు. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుండగా.. భారత రాష్ట్ర సమితి మాత్రం తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నది.
గతంలో కేసీఆర్ తో భేటీ
కుమారస్వామి గతంలో ప్రగతి భవన్ వచ్చారు. ముఖ్య మంత్రి కేసీఆర్ తో పలుమార్లు భేటీ అయ్యారు. అంతేకాదు కేసీఆర్ భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తానంటే మద్దతు ఉంటుందని ప్రకటించారు. అప్పట్లో కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నప్పుడు కుమారస్వామికి కేసీఆర్ మద్దతు ప్రకటించారు. కానీ తీరా ఎన్నికల విషయానికి వచ్చేసరికి కెసిఆర్ యూ టర్న్ తీసుకున్నారు. అప్పట్లో భారత రాష్ట్ర సమితి ఢిల్లీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కూడా కుమారస్వామి వెళ్లలేదు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామి పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించారు..ఎన్డీఏ చేరుతున్నామని ప్రకటించారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి సహజంగా ఇక్కడి బిజెపికి అనుకూలంగా మాట్లాడాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా కుమారస్వామి ప్రకటన చేయడం సంచలనాన్ని కలిగిస్తోంది. గత కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామికి భారత రాష్ట్ర సమితి నుంచి కనీస మాట సాయం కూడా దక్కలేదు. అలాంటి వ్యక్తి హఠాత్తుగా భారత రాష్ట్ర సమితి వైపు టర్న్ తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Kumaraswamy extends full support to kcrs brs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com