KTR And Harish Rao
KTR And Harish Rao: ఒకాయన ఉత్తర తెలంగాణ మొత్తం తిరిగి వస్తే.. మరొక ఆయన దక్షిణ తెలంగాణను మొత్తం చుట్టేసి వచ్చారు. ప్రతిపక్ష పార్టీలు సీట్ల సర్దుబాటు, టికెట్ల కేటాయింపు వరకే ఆగిపోయిన సందర్భంలో.. అసలు వారిద్దరూ విరామం అనేదే లేకుండా తిరిగేసారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాదు స్తబ్దంగా ఉన్నచోట కేడర్ కు దిశా నిర్దేశం చేశారు. గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. బావ బయట ఉంటే, బామ్మర్ది సైలెంట్ గా ఉండేవారు. బామ్మర్ది ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుంటే.. బావ ఇంకేదో పనిలో ఉండేవారు. కానీ గత చరిత్రను ఇప్పుడు వారు పక్కనపెట్టి, కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారు.
ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న స్పష్టమైన సమాచారం తోనే బావాబామ్మర్దులు నిన్నటిదాకా జోరు పెంచారు. కోడ్ అమల్లోకి రాకముందే.. ఆయా నియోజకవర్గాల్లో వందల కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి వద్దనే ఉన్నప్పటికీ.. మంత్రులు కేటీఆర్, హరీశ్ (బావా బామ్మర్దులు) అంతా తామే అయి ప్రజల్లోకి వెళ్ళారు. సమయం తక్కువ కావడంతో హెలికాప్టర్లు వేసుకొని మరీ ఒకేరోజు రెండు, మూడు నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు.. మరోవైపు సభల్లో వాడి వేడి ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేశారు. ఇటీవలి కాలంలో వారిద్దరూ 50 నియోజకవర్గాల్లో పర్యటించినట్లు బీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.
కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న సీఎం కేసీఆర్ ఇంటికే పరిమితం కాగా.. వారిద్దరూ జనంలో దూకుడు పెంచారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కేసీఆర్ కూడా దాదాపు వంద నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, బీఆర్‌ఎస్ అభ్యర్థులు సైతం ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ప్రతిచోట సభలు నిర్వహించి.. ఇటీవలి కాలంలో అధికార పార్టీపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై రాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. తామెంటో ప్రజలకు తెలియజెప్పే విధంగా మోదీని, బీజేపీ విధానాలను సైతం ఎండగట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని, వారంటీ లేని ఆ పార్టీ చెబుతున్న గ్యారెంటీలను ఎవరు నమ్ముతారని దుమ్మెత్తి పోశారు. బీజేపీకి మతం తప్ప మరో అంశం తెలియదని, ఆ పార్టీలో వారసత్వ రాజకీయాలు లేవా అంటూ ఎదురు దాడి చేశారు. కాగా.. సీఎం కేసీఆర్ ఈనెల 16న వరంగల్ సభలో ప్రకటించనున్న మేనిఫెస్టోకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ktr and harish rao who are rushing in the campaign
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com