Huzurabad Bypoll: హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానున్న క్రమంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ దూసుకుపోతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీ వెనుకపడిపోయింది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆలోచన మరో విధంగా ఉందని తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికతో ఎవరికి ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతోనే తాత్సారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఎన్నిక కోసం చేస్తున్న వ్యూహమేనని చెబుతున్నారు. అన్ని పార్టీలు ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కోసం ముగ్గురి పేర్లు అధిష్టానం పరిశీలించినా అవి ఫైనల్ కాలేదని తెలుస్తోంది. మొదట్టో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు వినిపించినా సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయన పేరు కూడా ఓకే కాలేదు. దీంతో వరంగల్ మహిళా నాయకురాలు కొండా సురేఖ పేరు వినిపించినా ఆమెకు స్థానికత వ్యతిరేకత వచ్చేలా ఉందని భావిస్తున్నారు. దీంతో ఆమె అభ్యర్థిత్వంపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ మొత్తానికి కొండా సురేఖ కే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఇక్కడ మరో అభ్యర్థిని నిలబెట్టాలని రేవంత్ చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అభ్యర్థి ఎంపికలో ఇంత ఆలస్యం చేస్తే ఓట్లు ఎలా పడతాయని పార్టీనేతల్లోనే అనుమానాలు వస్తున్నాయి. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగంలో ఉంటాడని చెబుతున్నా దానిపై ఇంకా స్పష్టత కానరావడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
వచ్చే రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నాయి. రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ పాలనపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. రాష్ర్టంలో రాక్షస పాలన సాగుతోందని దుయ్యబడుతున్నారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు కార్యాచరణ ప్రకటించారు. డిసెంబర్ 9న విద్యార్థి, యువసేన భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.