Kolkata Trainee Doctor case : వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత ఆమె తల్లిదండ్రులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే..” ఆమెకు ఒక కూతురు ఉంటే తెలిసేది నా బాధ” అంటూ బాధితురాలి మాతృమూర్తి వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయినప్పటికీ ఈ కేసు విచారణలో ముందడుగు పడటం లేదు. ఈ నేపథ్యంలో హత్యాచారానికి గురైన వైద్యురాలి స్నేహితుడు తన ఆవేదనను అక్షర రూపంలో వ్యక్తం చేశాడు. ” నా దుర్గకు ఇంతవరకు న్యాయం జరగలేదు. న్యాయం కోసం పదేపదే అడుగుతోంది. ఇకపై నేను ఏ వేడుకా చేసుకునే పరిస్థితి లేదు. నా గుండె బద్దలైపోయింది. ఆమె చనిపోయిందని తెలిసిన తర్వాత నా భవిష్యత్తు మొత్తం అంధకారంగా మారింది. నా కలల గూడు ఒక రాత్రిలో చెదిరిపోయింది. ఒక మృగాడి పైశాచికానికి ఆమె బలైంది” అంటూ తన ఆవేదనను కవిత రూపంలో పంచుకున్నాడు. తన స్నేహితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాడు..
ఉదంతం ఇంకా చల్లారలేదు
కోల్ కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి ఉదంతం పశ్చిమబెంగాల్లో ఇంకా చల్లారలేదు. దీనిపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ” చనిపోయి నెల దాటింది. ఇకపై అందరూ దుర్గ పూజలకు సిద్ధం కావాలని” ఆమె వ్యాఖ్యానించడం పెను దుమారాన్ని రేపింది.. మమత చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైద్యురాలి స్నేహితుడు తన ఆవేదనను ఒక కవిత రూపంలో రాశాడు. దానిని ఒక ఆంగ్ల ఛానల్ ప్రతినిధితో పంచుకున్నాడు. ” పురాణ కాలంలో ద్రౌపదికి దారుణమైన పరాభవం జరుగుతున్నప్పుడు ద్రోణాచార్యుడు అలానే ఉండిపోయాడు. ప్రస్తుతం దుర్గామాత నెలవై ఉన్న నగరంలో ఓ దుర్గ (నా స్నేహితురాలు) న్యాయం కోసం రోదిస్తోంది. న్యాయ దేవతకు ఇంకా కళ్ళకు గంతలు కనిపిస్తున్నాయి. న్యాయం కోసం దుర్గ కొలువై ఉన్న ఈ నగరం విలపిస్తోంది. ఈ వేదనను అనుభవించలేకపోతున్నామని చెబుతోంది. నా దుర్గ కు న్యాయం దక్కేది ఎప్పుడు? నేను ఇకపై ఏ వేడుకా చేసుకోలేను” అని తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక గత నెల 9న కోల్ కతా లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో 31 సంవత్సరాల జూనియర్ వైద్యురాలు అత్యాచారానికి గురైంది. ఈ ఘటన నేపథ్యంలో ఆమె స్నేహితుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. వైద్యుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడిప్పుడే అతడు కుదుటపడుతున్నాడు. ఆమెకు న్యాయం జరగాలని.. ఆమె కుటుంబంతో కలిసి పోరాడుతున్నాడు. ఆ వైద్యురాలు, ఇతడు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమకు ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న తరుణంలో ఈ దారుణం జరగడం అతడిని తీవ్రంగా కలిచి వేస్తోంది.