Kolkata trainee doctor incident: కోల్ కతా లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన వైద్యురాలి కేసు బెంగాల్ రాష్ట్రాన్ని అట్టుడికిస్తోంది. ఈ కేసు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సరికొత్త తలనొప్పిగా మారింది. అంతేకాదు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి కారణమైంది. అంతేకాదు సొంత పార్టీ నేత వైఖరిని మరొక నాయకుడు తప్పు పట్టడం కలకలం రేపుతోంది.
శిక్షణ పొందుతున్న వైద్యురాలిపై హత్యాచారం ఘటన బెంగాల్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటన వల్ల తృణమూల్ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం కలకలం వేపుతోంది. ఆ పార్టీ కీలక నేత సుఖేందు శేఖర్ రాయ్ ట్రైనీ వైద్యురాలి కేసు విచారణలో సిబిఐ పక్షపాత ధోరణి ప్రదర్శించకూడదని ట్విట్టర్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్, పోలీస్ కమిషనర్ ను కస్టోడియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ వైద్యురాలి ఆత్మహత్య చేసుకుందనే కట్టు కథను వారు తెరపైకి ఎందుకు తీసుకొచ్చారు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వైద్యురాలి మృతదేహం లభ్యమైన సెమినార్ హాల్ ను ఎందుకు కూల్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు . వైద్యురాలి పై హత్యాచారం చేసే విధంగా నిందితుడికి ఎవరు సహకరించారని, అతడు ఆ స్థాయిలో మారెందుకు కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. పోలీస్ జాగిలాలను సంఘటన స్థలానికి తీసుకొచ్చేందుకు దాదాపు మూడు రోజులపాటు సమయం ఎందుకు తీసుకున్నారని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఇవి తనకు వచ్చిన ప్రశ్నలు మాత్రమే కాదని, ప్రజల్లో కూడా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయని, అందువల్లే తాను నిలదీయాసి వస్తుందని అన్నారు.
ఈ పోస్టుపై అదే పార్టీకి చెందిన మరో నాయకుడు కునాల్ ఘోష్ ట్విట్టర్ ఎక్స్ లో స్పందించారు. సుఖేందు శేఖర్ రాయ్ పోస్ట్ ను రీ ట్వీట్ చేశారు. ” ఈ ఘటనలో కచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం కోసం నేను డిమాండ్ చేస్తున్నాను . ఈ కేసులో సిబిఐ శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే శేఖర్ రాయ్ పోలీస్ కమిషనర్ ను తప్పు పట్టడంలో అర్థం లేదు. ఆయన విషయంలో డిమాండ్లు చేయడం సరికాదు. సీపీ తన పరిధిలో పని చేసుకుంటూ వెళ్లారు. దర్యాప్తు ప్రస్తుతం సానుకూల కోణంలో సాగుతుందని నేను భావిస్తున్నాను. మా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు నుంచి ఇలాంటి పోస్ట్ రావడం బాధ కలిగిస్తుందని” ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ట్వీట్ చేసిన నేపథ్యంలో సుఖేందు రాయ్ శేఖర్ కు పోలీసులు తాఖీదులు జారీ చేశారు. పోలీస్ జాగిలాల విషయంలో ఆయన నిరాధారమైన సమాచారాన్ని వ్యాప్తి చేశారని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో బీజేపీ నేత లాకెట్ చటర్జీ, వైద్యులు కునాల్ సర్కార్, సుజర్నో గోస్వామికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
అయితే ఆ వైద్యురాలి హత్యాచారం కేసులో ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. అందువల్లే కోల్ కతా హైకోర్టు తీర్పు నేపథ్యంలో సిబిఐ ఈ కేసును టేక్ ఓవర్ చేసింది. ఈ కేసులో కీలకంగా మారిన సెమినార్ హాల్ లో ఆధారాలను ధ్వంసం చేసేందుకు అల్లరిముకలు ప్రయత్నించాయి. ఇదే సమయంలో పోలీస్ కమిషనర్ వెంటనే విలేకరుల సమావేశం నిర్వహించి.. పలు విషయాలను మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. అయితే రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు మమత ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయని, ఆమె పీఠాన్ని కదిలించబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.