Mamata Banerjee : కోల్ కతా లోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై చోటు చేసుకున్న హత్యాచార సంఘటన పెను సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలకు ఆజ్యం పోసేలా చేస్తోంది. ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళనలు చేపడుతున్నారు. ఓపి సేవలను నిలుపుదల చేశారు.. అత్యవసర సేవలు మాత్రమే చేస్తున్నారు. వైద్యుల నిరసనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. ఈ క్రమంలో శాంతిభద్రతలు కట్టు తప్పకుండా చూడాలని, ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఘటన చోటుచేసుకున్న పశ్చిమ బెంగాల్లో ఎప్పటికప్పుడు సమాచారం తమకు అందించాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మెయిల్ లేదా ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా తమకు నివేదికలు పంపాలని హోంశాఖ ఆదేశాల జారీ చేసింది. నివేదికల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అంచనా వేసి మిగతా చర్యలు తీసుకుంటామని హోం శాఖ వెల్లడించింది. “హత్యాచారం జరిగిందని భావిస్తున్న వైద్య కళాశాల కు చెందిన అధికారుల నుంచి మాకు సరైన సమాచారం అందలేదు. వారి వద్ద నుంచి కూడా కనీసం మద్దతు దక్కలేదు. పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే ఈ కేసును కోల్ కతా హైకోర్టు సిబిఐకి అప్పగించిందని” జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
హత్యాచారం ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటీవల దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.” డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు భద్రత కల్పించాలి. కళాశాలలో, ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కచ్చితంగా ఉండాలి. రక్షణ చర్యలను విధిగా పాటించాలి. బహిరంగ ప్రదేశాల్లోనే ఓపిడి, వార్డులు, క్యాజువాలిటీ, హాస్టళ్లు, నివాస ప్రాంతాలు ఉండేలాగా చూడాలి. వైద్యులు, ఇతర సిబ్బంది తిరిగే కారిడార్లలో భద్రతను కల్పించాలి. ఇందుకోసం తగిన సిబ్బందిని కేటాయించుకోవాలి. ముఖ్యంగా అనుమానాస్పద వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులలోకి పంపించకూడదని” ఆ ఉత్తర్వులలో నేషనల్ మెడికల్ కమిషన్ పేర్కొంది.
నేషనల్ మెడికల్ కమిషన్ ఉత్తర్వుల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. తదుపరి చర్యలకు ఉపక్రమించింది. వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రత్యేకంగా పోలీసులను నియమించింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను ఆదేశించింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలోనూ రాత్రిపూట మహిళా వైద్యులకు విధులు కేటాయించకూడదని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు అనుమానిత వ్యక్తులను కళాశాలలోకి అనుమతించకూడదని స్పష్టం చేసింది.