
తెలంగాణలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీజేఎస్ పోరాటాలు చేస్తుందని ప్రొఫెసర్ కొదండరాం తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం తాను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధపడగా పోలీసులు నిరాకరించడంపై కొదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు దీక్షకు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ ప్రొఫెసర్ కొదండరాం తన పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. 48గంటల పాటు దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కొదండరాం దీక్షకు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ.. ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య.. సీపీఎం..సీపీఐ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కొదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడిచినా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. వ్యవసాయం సైతం సంక్షోభంలో కూరుకపోయిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల ఊబిలో కురుకపోయిందని ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన 48గంటల దీక్ష కొనసాగుతుందని కొదండరాం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీజేఎస్ శ్రేణులు హైదరాబాద్ తరలి రావాలని.. పోలీసులు అరెస్టు చేస్తే అక్కడే దీక్ష చేపట్టాలని కొదండరాం పిలుపునిచ్చారు.