
గడ్డకట్టే చలి.. దాదాపు మైనస్ డిగ్రీలు.. అయినా పట్టువదలని రైతులు.. దేశ రాజధాని వేదికగా కేంద్రంలోని బీజేపీ అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల పోరాటం 37 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ శనివారం 75 ఏళ్ల కశ్మీర్ సింగ్ అనే వృద్ధ రైతు నిరసన ప్రదేశంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ సాగు చట్టాలు రద్దు కోరుతూ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతుల సంఖ్య మూడుకు చేరింది. అయినా అటు కేంద్రప్రభుత్వం.. ఇటు రైతులు పట్టువీడడం లేదు. ఆ చర్చలు ముందుకు సాగడం లేదు. అసలు తప్పు ఎవరిది? ఎందుకీ కొట్లాట.. అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ సీఎం కేసియార్ ఇటీవల మార్కెట్ యార్డులను ఎత్తివేస్తూ రైతుల నుంచి ఇక ధాన్యం కొనుగోలు చేయమని చేసిన ప్రకటన తెలంగాణ రైతులను షాక్ కు గురిచేసింది. కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతుగా చేసిన ఈ ప్రకటన వ్యూహాత్మకం కావచ్చు, కాకపోవచ్చు గానీ మొత్తానికి ఒక వాస్తవాన్ని ప్రకటించింది. అది కొత్త వ్యవసాయ చట్టం వల్ల ఇకపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల్లో తొలి అడుగు మాత్రమే. చివరి దినాన ప్రభుత్వం రైతుతో సంబంధం తెంచుకోవడంతో మిగులుతుది. ప్రభుత్వానికీ రైతుకీ మధ్య బంధం ఎందుకుండాలి అనేవాళ్లు.. ప్రభుత్వం-రైతుల కోసం ఏం చేస్తుందో తెలుసుకోవాలి.
ప్రభుత్వం రైతులకు తమ భూమిలో విత్తడానికి విత్తనాలు సబ్సిడీగా ఇస్తుంది. ఎరువుల మీద సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం ఒక బస్తా యూరియా మీద రూ.585 దాకా ఇస్తోంది.. నీళ్ల వాడకానికి ప్రాజెక్టులు నిర్మిస్తుంది, కాలువలు తవ్వుతుంది, బోరు బావులు ఉచితంగా వేస్తోంది. ఆ బావులనుండి నీరు తోడుకోవడానికి కరెంటు ఉచితంగా ఇస్తుంది. వేసిన పంటకు ఇన్సూరెన్సు ఇస్తుంది. కనీస మద్దతు ధర ఇస్తుంది. పంటను తరళించడానికి రోడ్లు వేస్తుంది, లారీలు, ట్రాక్టర్ల వంటి యంత్రాల కవసరమయ్యే మయ్యే డీజిల్ మీద సబ్సిడీ ఇస్తుంది. గోదాములు గిడ్డంగులు ఏర్పాటు చేస్తుంది. మార్కెట్ యార్డులని నెలకొల్పుతుంది. రైతుకు మద్దతుగా సరుకు అమ్మకం జరిగే యంత్రాంగం నిర్మిస్తుంది. రైతు పంటల మీద అమ్మకపు పన్నునే కాక, ఆదాయపన్ను కూడా లేకుండా చూస్తుంది. ఠక్కువ వడ్డీకి బ్యాంకుల్లో లోన్లు ఇప్పిస్తుంది, ప్రత్యేక వ్యవసాయ బ్యాంకుల్ని, సహకార సంఘాల్ని నిర్వహిస్తుంది. భూమి రికార్డుల్ని నిర్వహిస్తుంది, భూమిమీద పనిచేసే కౌలు రైతుల్ని సరిచూస్తుంది.
డ్రిప్ వంటి నీటిపారుదల కోసం పైపులు, ఇంజిన్ల మీదా సబ్సిడీ ఇస్తుంది. రకరకాల క్రిమికీటకాల మీదా, మందుల మీదా, మేలురకపు విత్తనాల మీదా పరిశోధనలు నిర్వహిస్తుంది. వాటికోసం తయారయ్యే విద్యార్థులకు కళాశాలలు నిర్మిస్తుంది, పరిశోధన తర్వాత వాటిని రైతులకు అందించేందుకు పత్రికలు, రేడియోలూ, ప్రచారాలు నిర్వహిస్తుంది. వాతావరణం గురించి రైతులకు చెప్పడం నుండి, ఏ పంటలు వేయాలో అవగాహన, పంటల నిర్వహణ కోసం శాటిలైట్లను ప్రయోగించడం దాకా చాలా పనులు నిర్వహిస్తుంది..
కొత్త వ్యవసాయ చట్టాలు అమలవడమంటే ప్రభుత్వం ఈ బాధ్యతల నుంచి తప్పుకోవడం అన్నమాట. కేసీఆర్ తాజాగా చేసిన నియంత్రిత సాగు ఎత్తివేత.. పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయదన్న ప్రకటన ఈ చర్యల్లో తొలిమెట్టు. ఎందుకంటే ఇవన్నీ నిర్వహించే ప్రభుత్వం తాను రైతుకీ, వినియోగదారునికీ మధ్య తాను నిర్వహిస్తోన్న పాత్ర నుండి తప్పుకుని ప్రపంచంలో అత్యంత ధనవంతులైన కార్పొరేట్లకు ఈ పని అప్పజెబుతుంది. వాళ్లు వ్యవసాయం చేయరు. రైతులతో చేయిస్తారు. కొన్నాళ్ల తర్వాత తిరిగిచూస్తే పొలం పేరుకు మాత్రమే రైతుది, శారీరక కష్టం మాత్రమే రైతుది. మిగతాదంతా కార్పొరేట్ కంపెనీలది.
ఇంత వ్యవసాయం చేసి పంటలు పండించాల్సిన అవసరం లేదు, బడాకంపెనీలు అన్ని పొలాల్ని ఏకంచేసి అమెరికాలో లాగా దేశం మొత్తంలో వ్యవసాయాన్ని ఐదారుమంది కార్పొరేట్ దిగ్గజాలు మాత్రమే చేస్తూ, వారు ఏది పండిస్తే అది తిందామంటే సమస్యలేదు!
సమస్య ఇంకా వుంది, ఈ దేశం వ్యవసాయం మీదే కాదు, వ్యవసాయం నుండి వచ్చిన పరిశ్రమల మీదా ఆధారపడివుంది. వ్యవసాయానికి ఉపయోగించే వాహనాలూ, యంత్ర పరికరాలూ, ఎరువులూ, పురుగుమందులూ మాత్రమే కాదు కంటికి కనపడే ఎన్నో పనులు, ఎంతోమంది, ఎన్నోస్థాయిల్లో చేస్తుంటారని గుర్తించాలి.
ఉదాహరణగా చూస్తే వేరుశేనగ మాత్రమే రైతు పండిస్తాడు. అయితే దాన్ని సమీప పట్టణంలోని డికార్టికేటింగ్ మిల్లుకి తరలించడానికి, అక్కడ మిల్లులో పప్పు తీయడానికి, గ్రేడింగ్ చేయడానికి, అందులో మసాలా పప్పు అయితే ఉత్తరాదికి, మామూలుదైతే దక్షిణాదిలోని వివిధ చోట్లకు చేర్చడానికి, నూనె తయారీకి ఆయిల్ మిల్లుకు చేర్చి ఆయిల్ తయారీకీ, చివరికి మన వీధిచివరి దుకాణం దాకా దాన్ని చేరవేసే రవాణా, ఈ పప్పుని వాడి చాక్లెట్లు తయారీ పెద్ద కంపెనీల నుండి పప్పు చెక్కీలు చేసే పట్టణంలోని చిన్న కుటీర పరిశ్రమల దాకా అనేక కుటుంబాలు, శ్రామికులు ఉపాధిపొంది జీవనోపాధిని సంపాదించుకుంటాయి. అయితే ఈ కొత్త చట్టాలు అమలైతే రైతుల నుంచి పంట డైరెక్టుగా కంపెనీకి చేరుతుంది. పొలం నుండి ఫ్యాక్టరీకీ, అక్కడే తుది వస్తువుగా యంత్రాల సహాయంతో తయారీగా రూపొందుతుంది. డిమాండ్ వుంటే డైరెక్టుగా విదేశాలకు ఎగుమతి చేయడం, లేకపోతే డైరెక్టుగా షాపింగ్ మాల్స్ కి అతడు నిర్ణయించిన ధరకి వస్తుంది. అప్పటికి ఉపాధి లేక బిచ్చగాళ్లైన మనం మాల్స్ ముందు అడుక్కుని బతికేయొచ్చు.
ఏతావాతా చెప్పే విషయం ఒకటే.. వ్యవసాయం కార్పొరేట్ చేతుల్లోకి పోవడం. రైతు పేరుతో భూమి ఉంటుంది నామ్ కే వాస్తే. దానిమీద ఏం పండించాలి,? ఎలా పండించాలి,? ఎప్పుడు పండించాలి..? అన్నీ కార్పొరేట్ సంస్థలు ముందే కొన్నేళ్లపాటు వరకు కుదుర్చుకున్న అగ్రిమెంటు ప్రకారం నిర్ణయమవుతుంది. ఊర్లో షావుకారు, పట్టణంలో పురుగుమందుల యజమానిని కాదని పండించిన పంటలమ్ముకోలేని దుస్తితిలోకి రైతులు చేరుతారు. రేపు రైతులతో కంపెనీలకు ఏదైనా వివాదాలైతే కోర్టుల చుట్టూ కంపెనీల పెద్దపెద్ద లాయర్లని ఓడించే స్థోమత రైతులకు ఉండదు.. అప్పుడు ఆత్మహత్యలే శరణ్యం.. ‘‘అప్పుడు ఇది కర్మ భూమికాదు, కార్పొరేట్ భూమి’’గా మారుతుంది.