Kodali Nani – Chiranjeevi: వైసీపీ నేతలకు కనీస విచక్షణ ఉండదు. వారిలో విజ్ఞత అస్సలు కనిపించదు. అస్సలు విమర్శలకు తట్టుకోలేరు. అవతల ఉన్నది ఏ స్థాయి వ్యక్తి అని ఆలోచించరు. చివరకు న్యాయమూర్తులు పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పై పడ్డారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకని? సినిమా పరిశ్రమను స్వేచ్ఛగా విడిచిపెట్టండి అని మెగాస్టార్ కోరారు. అప్పటినుంచి వైసీపీ నేతలు చిరంజీవిపై పడి ఏడుస్తున్నారు. పిచ్చి మాటలతో రెచ్చిపోతున్నారు.
పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడంలో పేర్ని నాని,కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు ముందుంటారు. ఇప్పుడు చిరంజీవిపై పడ్డారు. ముందుగా కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారు. పరోక్షంగా చిరంజీవి పకోడీ గాడు అన్నట్టు మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లంతా పకోడీ గాళ్ళని.. తాము ఎలా ఉండాలో వారు సలహాలు ఇస్తున్నారు అంటూ ఘాటుగా స్పందించారు. తన వాళ్లకు కూడా ఆ సలహాలిస్తే బాగుంటుందని సూచించారు. మనకెందుకురా బాబు మన డాన్సులు, ఫైట్లు మనం చూసుకుందామని వాళ్లకు కూడా సలహా ఇస్తే మంచిదని చెప్పుకొచ్చారు.
తనకు తాను చిరంజీవి అభిమానిని చెప్పుకునే పేర్ని నాని సైతం మెగాస్టార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ మంత్రిపై కక్షతో సినిమాలో పాత్రలు పెట్టారని.. అందుకే ఎదుర్కోక తప్పదని నేరుగా చిరంజీవికే హెచ్చరికలు పంపారు. గిల్లితే గిల్లించుకోవాలి అన్న సినిమా డైలాగుని గుర్తు చేశారు. బాహ్య ప్రపంచంలో గిల్లినప్పుడు తప్పకుండా గిల్లుతారని.. సినిమా కాదన్న విషయం చిరంజీవికి గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై ఏం చేశారని నిలదీశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడుగుతున్నట్లు అని ఆక్షేపించారు. అటు బొత్స సత్యనారాయణ సైతం వ్యంగ్యంగా స్పందించారు. చిత్ర పరిశ్రమ పిచ్చుకని చిరంజీవి అంగీకరించారా అని సెటైర్ వేశారు.
అయితే వైసీపీ నేతలు నుంచి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుందని చిరంజీవికి తెలుసు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలోనే ఈ విషయం తేటతెల్లమైంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన ఆయన.. స్నేహితుడు చంద్రబాబు గురించి మాట్లాడారు. ఆయన చేసిన అభివృద్ధిని కొనియాడారు. మరోసారి ఆయన అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇలా మాట్లాడిన పాపానికి రజనీకాంత్ ను ఏ స్థాయిలో విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. చివరికి రజినీకాంత్ అనారోగ్యంపై కూడా మాట్లాడారు. కోట్లాదిమంది ఆరాధిస్తున్న ఓ హీరో శరీర ఆకృతి గురించి కూడా వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల సభ్యత, సంస్కారం అది. ఇది చిరంజీవికి తెలియంది కాదు. అయినా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే.. ఏ స్థాయిలో విసిగి వేసారి పోయారో అర్థమవుతుంది.