గుడివాడ, మచిలీపట్నంలలో సోమవారం పర్యటించిన పవన్.. మంత్రి కొడాలి నానిపై విమర్శల వర్షం కురిపించారు. గుడివాడ జంక్షన్‌లో నాని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నిస్తే.. ఒక్కొక్కరు బూతులు తిడుతుంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటి? నానియా? వైసీపీలో నానీలు ఎక్కువమంది. ఏదో ఒక నాని. ఏ నానో నాకు అర్థం కావడం లేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం’ అన్న కామెంట్ చేశారు. పవన్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నోరు తెరిస్తే ప్రత్యర్థులపై ఇష్టారీతిన విరుచుకుపడే కొడాలి నానిపై పవన్ నేరుగా విమర్శలు చేయడంతో అందరి దృష్టి వీరిపై పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ కొడాలి తనదైన శైలిలో పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: బ్రేకింగ్: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో మంగళవారం జరిగిన పేదలకు ఇల్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవనే పెద్ద బోడి లింగమంటూ విరుచుకుపడ్డారు. తామంతా శివలింగాలం కాబట్టే మచిలీపట్నం, గుడివాడ ప్రజలు తమను నెత్తిమీద పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.
Also Read: పవన్ షో వెనుక అసలు కథ ఇదేనా..?
ఆయన పెద్ద బోడిలింగం కాబట్టే గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని విమర్శించారు. ప్యాకేజీలు తీసుకొని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్‌లను ప్రజలు నమ్మరన్నారు. ప్రజల తిరస్కారానికి గురైన పవన్ సిగ్గు, శరం లేకుండా మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. పవన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దురదృష్టమన్నారు. గజదొంగ లాంటి చంద్రబాబు, బోడి లింగం లాంటి పవన్ కల్యాణ్‌లు ఎంతమంది వచ్చినా, దేవుడు ఆశీస్సులు ఉన్నంత కాలం జగన్ బొచ్చు కూడా పీకలేరంటూ కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా నిన్న పవన్.. నేడు నాని వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాల్లో హీట్ పుట్టినట్లైంది. మరి నాని వ్యాఖ్యలపై జనసేన ఎలా స్పందిస్తుందో.. జనసేనాని ఎలా కౌంటర్ ఇస్తాడో చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్