Kiran Kumar Reddy: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రి. వైఎస్ మరణంతో రోశయ్య అనూహ్యంగా సీఎం పదవి చేపట్టగా.. అక్కడకు కొద్దిరోజులకే కిరణ్ కుమార్ రెడ్డి ఆ పదవిని అందిపుచ్చుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయంతో కిరణ్ విభేదించారు. సమైఖ్యాంధ్ర పార్టీ పెట్టినా పెద్దగా వర్కువుట్ కాలేదు. ఒక్క సీటు రాలేదు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ లో ఉన్నా.. ఏమంత యాక్టివ్ గా లేరు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ జోడో యాత్రను సైతం పెద్దగా పట్టించుకోలేదు. కనీసం అటువైపు చూడకపోవడంతో అసలు కాంగ్రెస్ లోనే ఉన్నారా? లేకుంటే ఏదైనా పునరాలోచన చేస్తున్నారా? అన్నది మాత్రం అంతుపట్టడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటే ఆయన తప్పనిసరిగా రాహుల్ తో అడుగులు వేసుండే వారు. కానీ ఆయన స్థానికంగా అందుబాటులో ఉన్నా రాహుల్ ను మర్యాదపూర్వకంగానైనాకలవలేదు. అసలు ఏపీలో మరో పదేళ్ల వరకూ కాంగ్రెస్ కు లైఫ్ లేదనే కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నట్టు తెలుస్తోంది. అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి ఎందుకు సమయం వృథా చేయడం అని భావిస్తున్నట్టున్నారు. అందుకే రాజకీయాలకు, చివరకు మీడియాకు సైతం దూరంగా ఉన్నారు.

చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు అయితే మరొకరు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్సార్ మరణం తరువాత పెద్దిరెడ్డే ప్రథమ శత్రువుగా మారిపోయారు. పెద్దిరెడ్డితో పెరిగిన వైరం నల్లారి కుటుంబాన్ని చంద్రబాబుకు దగ్గర చేసిందన్న టాక్ అయితే మాత్రం ఒకటుంది. అందుకు తగ్గట్టే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీ గూటికి చేరారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగానే పోటీచేశారు. కానీ ఓటమి చవిచూశారు. నాడు కిరణ్ కుమార్ రెడ్డే తమ్ముడ్ని టీడీపీలో చేర్పించారని ప్రత్యర్థులు ఆరోపించారు. అయితే నాడు కిరణ్ ఎన్నిరకాల అండదండలు అందించినా కిశోర్ ను మాత్రం గెలిపించుకోలేకపోయారు. ఈసారి మాత్రం తమ్ముడి గెలుపునకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది.
నందమూరి బాలక్రిష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి క్లాస్ మేట్స్. మంచి స్నేహితులు కూడా. బాలక్రిష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి తన స్నేహితులైన కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిల ను ఆహ్వానించారు. కార్యక్రమం ప్రోమో తెగ హల్ చల్ చేస్తోంది. టెలికాస్ట్ కాకముందే ఒకరకమైన అంచనాలు పెంచుతోంది.

తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మధ్య భేదాభిప్రాయలు సృష్టించింది ఓ మంత్రి అని కిరణ్ కుమార్ రెడ్డి తన మనసులో ఉన్న మాటను వ్యక్తపరిచారు. అయితే అది ముమ్మాటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని నల్లారి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. నాడు పెద్దిరెడ్డి జగన్ ను అడ్డంపెట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా అడ్డుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అటు సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు జగన్ తో తిరుగుబాటు చేయించింది కూడా పెద్దిరెడ్డేనని ఆరోపిస్తున్నారు. అందుకే పెద్దిరెడ్డిని టార్గెట్ చేసుకొని చిత్తూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి పట్టు బిగిస్తారన్న టాక్ అయితే ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించడంతో వచ్చే ఎన్నికల్లో తెరవెనుక ఉండి మంత్రి పెద్దిరెడ్డిని దెబ్బకొట్టేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది.