కరోనా కట్టడికి కేరళవాసులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. చిన్న చిట్కాతో కరోనా మహమ్మరి తమ దగ్గరికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా విపత్కర సమయంలో ప్రతీఒక్కరు ఇంట్లో ఉండటం, చేతులను శుభ్రంగా కడుకోవడం, భౌతిక దూరం పాటించడం లాంటి చేయడం తప్పనిసరి అయింది. అయితే నిత్యావసరాల కోసం బయటికి వెళ్లినప్పుడు జనం ఒకరిపై ఒకరు పడిపోతుండటంతో కేరళవాసులు దీనిని చెక్ పెట్టేందుకు ఓ చక్కటి ఆలోచన చేశారు. ప్రతీఒక్కరు సామాజిక దూరం పాటించేలా తప్పనిసరిగా గొడుగు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఈమేరకు తన్నీర్ ముక్కోమ్ గ్రామ పంచాయతీ తాజాగా కీలక తీర్మానం చేసింది.
ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లేటప్పుడు ముఖానికి మాస్కులు వేసుకోవడంతోపాటు గొడుగు కూడా వెంట తీసుకెళ్లాలని గ్రామపెద్దలు ఆదేశించారు. నిత్యావసర వస్తువులు తీసుకునేంత వరకు గొడుగు తలపైనే పెట్టుకోవాలని సూచించారు. దీని వల్ల పక్కన ఉండే ఇతరులకు దూరంగా ఉంటారని చెబుతున్నారు. దీని వల్ల బయటికి వచ్చినప్పుడు అందరూ సామాజిక దూరంగా పాటిస్తారని అంటున్నారు. దీంతో ఇక్కడి గ్రామస్థుల బయటికి వచ్చినప్పుడు గొడుగుతోనే వస్తున్నారు. క్యూ లైన్లోలో గొడుగులతో నిల్చొని సరుకులను తీసుకెళుతున్నారు.
ఈ ఐడియాను చూసిన కేరళ మంత్రి థామస్ ఇసాక్ ఫిదా అయ్యారు. గ్రామస్థుల గొడుగులతో దుకాణం ఎదుట నిలుచున్న ఫొటోను తన ట్వీట్ చేసి ప్రశంసించారు. ప్రజలంతా ఈ ఐడియాను పాటించాలని సూచించారు. అదేవిధంగా గొడుగు లేనివారి కోసం తక్కువ ధరలో గొడుగులను గ్రామపంచాయతే అందిస్తుండటం పల్లెవాసుల ముందుచూపుకు నిదర్శనంగా కన్పిస్తుంది. ఇది చూసిన నెటిజన్లు ‘గొడుగుతో గో కరోనా’ ఐడియా బాగుందని కితాబిస్తున్నారు.