Modi- KCR: సింహం వేటాడేటప్పుడు జింక కనిపిస్తే ఉరికి ఉరికి వేటాడుతుంది. అదే ఇంకా బలిష్టమైన జంతువు కనిపిస్తే అదును కోసం వేచి చూస్తుంది. యుద్ధంలో, వేటలో పాటించాల్సిన సిద్ధాంతం ఇదే. ప్రస్తుతం కేంద్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉప్పు, నిప్పు మాదిరి పరిస్థితి ఉంది. ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. దీనికోసం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. కెసిఆర్ కూతురు కవితని కేంద్రం కార్నర్ చేస్తే.. కేంద్రంలోని పెద్దలను మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసు ద్వారా కేసిఆర్ కార్నర్ చేశారు. సరే ఈ కేసులు ఎటు తేలుతాయో, ఎటు వంటి ఫలితం వస్తుందో చెప్పలేం గానీ.. నిన్న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట కూడా మోదిపై మాట్లాడలేదు. పదునైన విమర్శ చేయలేదు.

గుజరాత్ లో గెలవడమే కారణమా
మొన్న జరిగిన గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపి బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. కనివిని ఎరుగని స్థాయిలో సీట్లను సాధించింది. ఓటు షేర్ కూడా భారీగా పెంచుకుంది. నమస్తే తెలంగాణ దృష్టిలో ఈ విజయం పెద్ద విజయం కాకపోయినప్పటికీ… ఆ పత్రిక ఓనర్ కేసీఆర్ మాత్రం బాగానే గుర్తించినట్టు కనిపిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ మరుసటి రోజే కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ ఈసారి నరేంద్ర మోడీపై ఎటువంటి విమర్శ చేయలేదు. అసలు ఆయన ప్రస్తావన కూడా తెలియదు. బహుశా గుజరాత్ గెలుపు వల్ల మోదీ బలం మరింత పెరిగిందని కెసిఆర్ అంచనా వేసి ఉండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకు మౌనంగా ఉన్నట్టు
ఇటీవల కాలంలో మైక్ ముందు మాట్లాడే ఏ అవకాశం వచ్చినా సరే సందర్భ శుద్ధి లేకుండా మోడీ మీద విరుచుకు పడిపోవడం కేసీఆర్ అలవాటు చేసుకున్నారు.. తన జాతీయ పార్టీ ఆవిర్భావ సమయంలో ఇదే ధోరణి ప్రదర్శిస్తారని చాలామంది అనుకున్నారు. మోడీ మీద తనదైన మాటల దూకుడు కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు. కానీ కెసిఆర్ తన సహజ ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరించారు. పైగా ఆ కార్యక్రమానికి హాజరైన వారందరు కూడా మోదిపై, కేంద్రంపై ఒక్క విమర్శ కూడా చేయలేదు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమం కూడా ఆనుకున్నంత భారీ స్థాయిలో ఏమి జరగలేదు. ఇద్దరు ముగ్గురు రైతు సంఘాల నాయకులు తప్ప పెద్దగా విపక్ష నాయకులు వచ్చినట్లు లేదు.. అందుకే కేసిఆర్ కూడా కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా చేశారు. తానే ఈ పతాకాన్ని, జెండాను ఆవిష్కరించారు.

అంతవరకే పరిమితం
నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో కెసిఆర్ లోతుల్లోకి వెళ్ళలేదు. కేంద్రంలో అధికారంలోకి వస్తే భారత రాష్ట్ర సమితి ఏం చేస్తుంది? ఎటువంటి కార్యాచరణ రూపొందించింది? దేశానికి ఏం కావాలి? ఎలా చేస్తే దేశం బాగుపడుతుంది అనే అంశాల మీద మాత్రమే మాట్లాడారు. ఈ సమావేశంలో మోడీ మీద విమర్శల జోలికి వెళ్ళని కేసీఆర్.. గుజరాత్ ఎన్నికల విజయాన్ని పురస్కరించుకుని ఆమె కొంచెం వెనక్కి తగినట్టు కనపడుతున్నది. అయితే కెసిఆర్ ఈ మౌనం వెనుక తుఫాను ముందు ప్రశాంతతే అని కొంతమంది నాయకులు అంటున్నారు. ఈనెల 14న ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభించనున్నారు. అదే రోజు మోదీని లక్ష్యంగా చేసుకొని కెసిఆర్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి 11న ఎమ్మెల్సీ కవిత విచారణ ఎదుర్కోనున్న నేపథ్యంలో కెసిఆర్ మోడీ పట్ల కాస్త మెతక వైఖరి ప్రదర్శించారని స్పష్టమవుతోంది. కానీ ఇదే సమయంలో బీఆర్ఎస్ ఆవిర్భావానికి సంబంధించి బిజెపి నాయకులు తీవ్రమైన విమర్శలు చేశారు. తెలంగాణకు పట్టిన దరిద్రం పోయిందని వ్యాఖ్యలు చేశారు.