KCR- Deeksha Divas: నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి నాటి టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఉద్యమ సాధకుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష నేటితో 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆయన చేసిన పోరాటాన్ని తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ‘‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’’ అనే నినాదంతో తెలంగాణ సాధనే లక్ష్యంగా తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి ఉద్యమ విజేతగా నిలిచారు కేసీఆర్. 2009, నవంబర్ 29న సిద్దిపేట జిల్లా కేంద్రంలో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు దిగారు నేటి సీఎం. ఈ నిరాహారదీక్ష తెలంగాణ ఉద్యమ పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.

సమైక్య పాలన నుంచి విముక్తి కోసం..
నాటి సమైక్య పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిన రోజుకు గుర్తుగా దీక్షా దివస్ నిర్వహిస్తున్నారు తెలంగాణ ప్రజలు. రాష్ట్ర సాధనతో తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు దక్కించుకోవడమే కాకుండా రెండుసార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖచిత్రాన్ని, ప్రజల జీవితాల్లో మార్పుకు శ్రీకారం చుట్టారు. కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఉద్యమవీరుడికి దీక్షాదివస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో కేసీఆర్ నాడు ప్రారంభించిన ఆమరణ నిరాహారదీక్ష ఫొటోలను ప్రజలతో షేర్ చేసుకున్నారు. 2009, నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను 11రోజుల పాటు కొనసాగించారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా.. శరీరం సహకరించకపోయినా సుష్కిస్తున్నా మొక్కవోని పట్టుదలతో తాను అనుకున్న స్వరాష్ట్రాన్ని సాధించుకోగలిగారని తెలిపారు.
దిగివచ్చిన కేంద్రం..
కేసీఆర్ 11 రోజుల ఆమరణ దీక్షతో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో ఆయన దీక్ష విరమించారు. నాడు రాష్ట్రంలోని ప్రజలు సంబురాలు జరుపుకున్నారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఏటా దీక్షా దివస్ నిర్వహించుకుంటున్నారు. నాటి ఆమరణ నిరాహారదీక్ష స్ఫూర్తితో, స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ సారధ్యంలో, సర్కారు సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాలు సగర్వంగా, సంతోషంగా ఉన్నారని కవిత ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలుస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి..
నాడు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించిన ఘనుడిగా కేసీఆర్ తెలంగాణ చరిత్రలో..ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే అప్పటి వరకు తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. తర్వాత విలీన హామీ నుంచి తప్పుకున్నారు. ఉద్యమ పార్టీని పటిష్టం చేస్తూ జాతీయ రాజకీయాల్లోకి అఢుగుపెట్టారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజలు, రైతులకు మేలు కలిగే ఎన్నో నూతన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆత్మబంధువుగా మారారు కేసీఆర్.