AP BJP: ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా? లేకుంటే షెడ్యూల్ ప్రకారం 2024లో మేలోనే జరుగుతాయా? అన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో అధికార వైసీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ముందస్తుగా వెళితే కలిసి వస్తుందా? లేక షెడ్యూల్ ప్రకారం జరిగితే సానుకూల ఫలితాలు వస్తాయా? అన్నది బేరీజు వేసుకుంటోంది. అయితే ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. అటు ప్రధాన విపక్షం టీడీపీతో పాటు జనసేన వచ్చే ఎన్నికలకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. పాదయాత్రలు, బస్సు యాత్రలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించాయి. దీంతో అధికార వైసీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. అటు హైకమాండ్ సైతం వచ్చే ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలన్న దానిపై గట్టిగానే వ్యూహాలను రూపొందిస్తోంది. కానీ అధికార పార్టీ ముందున్న ఆప్షన్లు రెండే. ఒకటి ముందస్తుకు వెళ్లడం, రెండూ నవరత్నాలను పక్కాగా అమలుచేసి షెడ్యూల్ ప్రకారం 2024లో ఎన్నికలకు వెళ్లడం. ఇందులో ఏది వర్కవుట్ అవుతుందన్న దానిపై వైసీపీ హైకమాండ్ తెగ కసరత్తు చేస్తోంది.

ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ టీవీ డిబేట్ లో విభిన్న ప్రకటన చేశారు. తాము అధికారంలోకి రావడానికి మూడు నెలలు చాలని చెప్పుకొచ్చారు. దీంతో అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. బీజేపీ యేంటి, మూడు నెలల్లో అధికారంలోకి రావడం ఏమిటని ఒకటే టెన్షన్ ప్రారంభమైంది. అయితే వైసీపీ ముందస్తుకు వెళ్లబోతుందని ..వారు మైండ్ గేమ్ ఆడుతున్నట్టే.. మేము ఆడగలమని సంకేతమిచ్చేలా సోము వీర్రాజు మాట్లాడారు. వాస్తవానికి బీజేపీ ఎన్నికలకు చివరి ఆరు నెలలు జగన్ సర్కారు పై అటాక్ కు ప్లాన్ చేసింది. రాజకీయ విమర్శనాస్త్రాలు సంధించి వైసీపీని డిఫెన్స్ లో పడేయ్యాలని భావించింది. దీనిని గమనించి జగన్ అండ్ కో స్ట్రాటజీ మార్చారు. బీజేపీకి అవకాశమివ్వకుండా ముందస్తుకు పోతే ఎలా ఉంటుందని ఆలోచించారు. కానీ కేంద్రంలో ఉన్నది బీజేపీ. ఆ పార్టీకి తెలియకుండా ముందస్తుకు వెళ్లడం దాదాపు అసాధ్యం. అందునా కేంద్రంతో చర్చించిన రాజకీయాంశాలు హైకమాండ్ రాష్ట్ర నేతలకు తప్పకుండా చెబుతుంది. అందులో భాగంగానే సోము వీర్రాజు మైండ్ గేమ్ ఆడుతూ తాము మూడు నెలల్లో అధికారంలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. వైసీపీలో కలవరపాటుకు కారణమయ్యారు.
అయితే గత ఏడాదిగా ముందస్తుకు వెళుతున్నామని వైసీపీకి లీకులు ఇస్తూ వచ్చింది. అదిగో..ఇదిగో అంటూ విపక్షాలను కన్ఫ్యూజ్ చేసే విధంగా వ్యవహరించింది. కానీ ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ లోనే చిక్కుకుంది. గ్రౌండ్ లెవల్లో చూస్తే ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. అటు విపక్షాలు టీడీపీ, జనసేన యాక్టివ్ అవుతున్నాయి. ప్రజల మధ్యలో ఉండి వారితో మమేకమయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉంది. టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని తుది రూపంలోకితేకపోవడం గత ఎన్నికల్లో మైనస్ గా మారింది. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా మారడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న అపవాదు, విమర్శ, ఆరోపణ ఉంది. ప్రజల నుంచి కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఆదరించిన వర్గాలు ఒక్కొక్కరూ దూరమవుతూ వస్తున్నారు. కాలం గడిచే కొద్దీ వ్యతిరేకత మరింత ముదిరిపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే ముందస్తు మేలన్న నిర్థారణకు జగన్ సర్కారు వచ్చినట్టు కనిపిస్తోంది.

తన సహచరుడు, ఆత్మీయ మిత్రుడు కేసీఆర్ గతఎన్నికల్లో ఇదే స్ట్రాటజీని అవలంభించారు. విపక్షాలను ఎదగనీయకుండా అణచివేశారు. వారికి సమయం ఇవ్వకుండా ముందస్తుకు వెళ్లి ఘన విజయం సాధించారు. ఇప్పుడు అదే ఫార్ములాతో జగన్ కూడా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. 2024 జనవరి నుంచి అటాక్ చేయాలని భావిస్తున్న బీజేపీని,ప్రజల్లోకి వెళ్లి బలం పెంచుకోవాలని చూస్తున్న టీడీపీ, జనసేనలను ఎదుర్కొవాలంటే ఏడాది గా ముందస్తుకు పోవడమే కరెక్ట్ అన్న స్థిర ఆలోచనకు జగన్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో మాదిరిగా వార్తలు గాసిప్స్ గా మిగులుతాయో.. లేక నిజంగా ఆ ఆలోచనలో ఉన్నారో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాలని భావిస్తున్నారు విశ్లేషకులు.