Telangana New Secretariat: తెలంగాణలో సరికొత్త పరిపాలన సంక్రాతి తర్వాత అదుబాటులోకి రానుంది. ఎనిమిదేళ్లుగా సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్, ఫామ్ హౌస్ నుంచే పాలన సాగించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంక్రాంతి తర్వాత సచివాలయం నుంచి పాలన సాగించబోతున్నారు. ఈమేరకు నూతన సచివాలయం పనులు త్వరగా పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. వచ్చే సంవత్సరం జనవరి 18న నుంచి కొత్త సచివాలయం నుంచి కేసీఆర్ పరిపాలన సాగించేలా ముహూర్తం ఖాయం చేశారు.

ఆరో అంతస్తులో సీఎం చాంబర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లక్కీ నంబర్ 6. ఏ పని చేసినా ఆయన ఆ నంబర్ కలిసి వచ్చేలా చూసుకుంటారు. 2018లో ప్రభుత్వం రద్దు చేసినా, తిరిగి ఎన్నికలు జరిగినా, తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు.. ఇలా అనేక విషయాల్లో ఆయన 6 నంబర్ కలిసి వచ్చేలా చూసుకుంటారు. పాత సచివాలయం వాస్తుకు లేదని, తన లక్కీ నంబర్‌కు అనువుగా లేదని భావించిన కేసీఆర్ ఎనిమిదేళ్లుగా సచివాలయం గేటు కూడా దాటలేదు. ప్రగతిభవన్ నుంచే పరిపాలన సాగిస్తున్నారు. తాజాగా పాత సచివాలయం కూల్చి రూ.600 కోట్లతో కొత్తది నిర్మిస్తున్నారు. మరో నెల రోజుల్లో పనులు పూర్తికానున్నాయి. ఈనేపథ్యంలో కేసీఆర్ తన లక్కీ నంబర్‌కు అనుగుణంగా కొత్త సచివాలయంలోని ఆరో అంతస్తులో తన చాంబర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించుకున్నారు. జనవరి 18వ తేదీన ఈ ఛాంబర్‌లో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం కేసీఆర్ బాధ్యతలను స్వీకరించనున్నారు. అదే రోజున కొన్ని ప్రధాన శాఖలకు చెందిన మంత్రులు కూడా బాధ్యతలను స్వీకరించే అవకాశాం ఉంది. సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తాన్ని ఖాయం చేసినందున ఇక నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.
అన్నీ వాస్తు ప్రకారమే..
వాస్తుకు అనుగుణంగా సచివాలయ కాంప్లెక్స్ నిర్మాణం జరుపుకొంటోంది. నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. పనులను వేగవంతం చేయాల్సి ఉంటుందని కాంట్రాక్ట్ సంస్థ షాపూర్జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులకు సూచించారు. వచ్చే సంవత్సరం జనవరి 18వ తేదీ నాటికి పూర్తి సచివాలయ కాంప్లెక్స్ అందుబాటులోకి తీసుకుని వచ్చేలా నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి సూచించారు. ఆరో అంతస్తుకు సంబంధించిన పనులు ముందుగానే ముగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కొత్త సచివాలయం.. ఇలా ఉంటుంది..
తెలంగాణ సచివాలయం నూతన భవనం పనులు 95 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. నిర్మాణ శైలులు ప్రధానంగా దక్కన్ కాకతీయపై ఆధారపడి ఉంటాయి. తెలంగాణ సచివాలయ ముఖద్వారంపై ఉన్న గోపురాల ఆలోచనలు.. హన్మకొండలో వేయి స్తంభాల ఆలయం నుంచి వచ్చాయి. ఈ ఆలయం కాకతీయుల అత్యుత్తమ శిల్ప కళ సంపదగా ఉంది. దీని ప్రేరణగా గోపురాల ఆలోచనలు ఉన్నాయి. మొత్తం డిజైన్లో తెలంగాణ చరిత్ర, విభిన్న సంస్కృతులు ప్రతిబింబించేలా ఉంటాయి. బయటి పోడియం క్లాడింగ్ ఎర్ర ఇసుక రాయితోనూ.. సెంట్రల్ టవర్ రాజస్థాన్ లేత గోధుమరంగు ధోల్పూర్ ఇసుకరాయి క్లాడింగ్‌తో ఉంటుంది. ఇతర నిర్మాణంపై తెలుపు రంగులో ఉన్నాయి. భవనం మెుత్తం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మితమవుతోంది. అన్ని లిఫ్టులు, మెట్లు, యుటిలిటీ గదుల రూపకల్పన ప్రణాళిక ప్రకారం చేశారు. ప్రధాన ప్రవేశం తూర్పు వైపున ఉంది.

ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంటుంది. ముఖ్యమంత్రి చాంంబర్, క్యాబినెట్ సమావేశ మందిరం, ముఖ్య కార్యదర్శి, సలహాదారులు, వ్యక్తిగత కార్యదర్శులు, సహాయక సిబ్బంది, వేచి ఉండే ప్రదేశాలు సైతం చూసేందుకు ముచ్చటగా ఉంటాయి. మిగిలిన అంతస్తుల్లో మంత్రుల ఛాంబర్లు, వివిధ విభాగాలు, సహాయక సిబ్బంది, సమావేశ గదులు, సాధారణ పరిపాలనా విభాగం కోసం కేటాయిస్తారు. దిగువ అంతస్తులలో పెద్ద సమావేశ మందిరాలు, వీవీఐపీలు వెయిటింగ్ ప్రదేశాలు, పోలీసు నిఘాలు, ఇంటెలిజెంట్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ రికార్డ్ రూమ్‌లు, స్టోర్ మొదలైనవి ఉంటాయి. సచివాలయంలో వెంటిలేషన్ సరిగా ఉండేలా ప్లానే చేశారు. ఈ భవనంలో మొత్తం 7 అంతస్తులు ఉన్నాయి. మొత్తం భవనం వైశాల్యం దాదాపు 7 లక్షల చదరపు అడుగులు. ఈ భవనంలో 3 అంతçస్తుల అరైవల్ గ్రాండ్ పోర్టికోతో 15 అడుగుల ఎతై ్తన ఎంట్రీ పోడియంతో అద్భుతమైన ప్రవేశ ద్వారం ఉంది. భవనం మధ్యలో తెలంగాణ అభివృద్ధిని ప్రదర్శిస్తారు. 33 జిల్లాల కళ, సంస్కృతిని ప్రదర్శించే కుడ్యచిత్రాలను గొడలపై ఉంటాయి.
650 కార్లు, 500 ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్. బ్యాంకు, డిస్పెన్సరీ, క్యాంటీన్, ఇంధనం నింపే స్టేషన్, అగ్నిమాపక స్టేషన్, విజిటర్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. పాత సచివాలయ ప్రాంగణంలోనే దీనిని నిర్మిస్తున్నారు.