KCR: పులి బయటకు వస్తుంది.. రేవంత్‌ బోను సిద్ధం చేశాడా.. రేపే కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం!

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసీఆర్‌ ప్రజల్లోకి వస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల్లో సుడిగా పర్యటన చేస్తారని సమాచారం. ఈమేరకు ముహూర్తం చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన పార్టీలో ఉత్సాహం నింపుతారని తెలుస్తోంది.

Written By: Raj Shekar, Updated On : January 31, 2024 12:10 pm
Follow us on

KCR: ‘త్వరలో మా పులి బయటకు వస్తుంది. పార్లమెంట్‌ ఎన్నిల ప్రచారంలో పాల్గొంటుంది. షెడ్డుకు వెళ్లిన కారును 100 స్పీడ్‌తో మళ్లీ పరిగెత్తిస్తుంది’ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు చెప్పే మాటలు ఇవీ. ‘ పులి బయటకు వస్తే.. బంధించేందకు బోను సిద్ధంగా ఉంచాం. పులి ప్రజల్లో ఉంటే ప్రమాదం’ కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివీ. కేటీఆర్, హరీశ్‌రావు చెప్పినట్లే కేసీఆర్‌ ఫిబ్రవరి 1న బయటకు రానున్నారు. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఆయన గురువారం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరి రేవంత్‌రెడ్డి ఏం చేయబోతున్నారు అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది.

కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన రెండు రోజులకే..
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తొమ్మిదిన్నరేళ్లు పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడించారు. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. దీంతో డిసెంబర్‌ 7న సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ కొలువుదీరిన రెండు రోజులకే కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో కాలుజారి పడ్డాడు. తుంటి ఎముక విరగడంతో యశోద ఆస్పత్రి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. వైద్యుల సూచన మేరకు కేసీఆర్‌ ఇన్నిరోజులు విశ్రాంతి తీసుకున్నారు.

కర్రసాయంతో వాకింగ్‌..
వేగంగా కోలుకుంటున్న కేసీఆర్‌ కొన్ని రోజులుగా కర్ర సహాయంతో వాకింగ్‌ చేస్తున్నారు. అదే విధంగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డ ప్రసాద్‌కుమార్‌కు లేఖ రాశారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు.

త్వరలో ప్రజల్లోకి..
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసీఆర్‌ ప్రజల్లోకి వస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల్లో సుడిగా పర్యటన చేస్తారని సమాచారం. ఈమేరకు ముహూర్తం చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన పార్టీలో ఉత్సాహం నింపుతారని తెలుస్తోంది.

రేవంత్‌ వ్యూహం ఏంటి?
ఇక ఇప్పుడు అందరి దృష్టి సీఎం రేవంత్‌పై పడింది. పులిని బోన్‌లో బంధించేందుకు ఆయన ఇప్పటికే ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఇప్పటికే విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన సీఎం.. ప్రాథమిక నివేదిక కూడా తెప్పించుకుంది. ఇందులో ఒక్క మేడిగడ్డలోనే రూ.3,200 కోట్లు దుర్వినియోగం అయినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా కేసీఆర్‌తోపాటు, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేసీఆర్‌ హయాంలో కీలక శాఖల్లో పనిచేసిన బాలకృష్ణ ఇప్పటికే అరెస్ట్‌ అయ్యారు. రేపో మాజో మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కూడా అరెస్ట్‌ అవుతారని ప్రచారం జరుగుతోంది.