Balineni Srinivasa Reddy: తెలుగుదేశం పార్టీలో చేరాలా? కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలా? లేకుంటే వైసీపీలో కొనసాగాలా? ఇది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంతర్మధనం. గత కొద్ది రోజులుగా వైసిపి హై కమాండ్ తీరుపై అసంతృప్తితోనున్న బాలినేని కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒంగోలు ఎంపీ సీటు విషయంలో హై కమాండ్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆయన పార్టీని వీడేందుకు దాదాపు డిసైడ్ అయినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులతో భవిష్యత్తు కార్యాచరణ పై ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సాయంత్రం లోగా ఆయన నిర్ణయం ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది.
ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి దిగజారుతోంది. ఇక్కడ వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. వై వి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డిల మధ్య చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత పదవి కోల్పోయిన బాలినేని పలు సందర్భాల్లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కేటాయింపు హామీ కార్యరూపం దాల్చితేనే తాను పోటీ చేస్తానని మెలిక పెట్టారు. కొద్ది రోజుల కిందట అందుకు సంబంధించి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో 40 రోజుల తర్వాత విజయోత్సవ సభతో ఒంగోలులో బాలినేని అడుగు పెట్టారు. దీంతో వివాదం సమసిపోయిందని అంతా భావించారు.. కానీ ఎంపీగా మాగుంట శ్రీనివాసుల రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని బాలినేని కోరారు. కానీ హై కమాండ్ అంగీకరించలేదు. పైగా స్థానికేతరుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా హై కమాండ్ నిర్ణయించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల సమన్వయకర్తగా సైతం ప్రకటించింది. దీంతో బాలినేని ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా విజయవాడలోని ఓ హోటల్ కు చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు, అనుచరులతో భవిష్యత్తు కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో హై కమాండ్ దూతగా వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపారు. అయినా సరే బాలినేని వెనక్కి తగ్గలేదు.
ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ వైసిపి హై కమాండ్ నిర్ణయం తీసుకోవడంతో.. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టిడిపిలోకి వెళ్లేందుకు దాదాపు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే తనకోసం చివరి వరకు ప్రయత్నించిన బాలినేని నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టిడిపి అగ్రనాయకత్వంతో మాగుంట చర్చలు జరిపారు. అంతా సానుకూలంగా పూర్తయ్యాయి. కానీ బాలినేని విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఆయనకు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రకాశం జిల్లా సమీక్షలో షర్మిల వైవి సుబ్బారెడ్డిని మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. ఎక్కడా బాలినేని గురించి కానీ, మాగుంట గురించి కానీ విమర్శించలేదు. ఈ లెక్కన వారిద్దరూ షర్మిల తో టచ్ లో ఉన్నారని వైసీపీ హై కమాండ్ అనుమానిస్తోంది. అందుకే ముందుగా మాగుంట విషయంలో అభ్యర్థిత్వాన్ని తేల్చింది. అటు బాలినేని విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఈ పరిణామాలను గమనించిన మాగుంట ముందుగానే తేరుకున్నారు. బాలినేని మాత్రం తన మాట చెల్లుబాటు అవుతుందని భావించారు. వైసిపి హై కమాండ్ అన్ని విషయాలు స్పష్టత ఇవ్వడంతో.. ఇప్పుడు పార్టీ మారే విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఆయన ఏ పార్టీలో చేరతారు అన్నది ఈ సాయంత్రానికి ఒక స్పష్టత రానుంది.